
వేధింపులకు గురైన జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్యను మాజీ మంత్రి, బీజేపీ నేత డా. గుండె విజయరామారావు, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పరామర్శించారు. 2023, మార్చి 11న సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి ఎమ్మేల్యే వేధింపులపై అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుండె విజయరామారావు.. ఆయన తాటికొండ రాజయ్య కాదు.. రాసలీలల రాజయ్య అని ఆరోపించారు. ఒక జానకీపురం సంఘటనే కాదు ఇంతకు ముందూ ఈయన రాసలీలలు అందరికి తెలుసులని వ్యాఖ్యానించారు.
ఈ చర్య ఎవరో కల్పితం చేసింది కాదని చెప్పారాయన. జానకీపురం సర్పంచ్ ఆర్థికంగా లేకున్నా శాసన సభ్యున్ని ఎదిరించింది అంటే తను ఎంతగా కృంగిపోయిందో అర్థమవుతుందన్నారు. ఒక శాసనసభ్యుడు ఇలా చేయడం అనైతికం..పార్టీకి అతీతంగా సర్పంచ్ నవ్యకు అండగా ఉంటామని తెలిపారు. రాజకీయాలలో నీతి న్యాయాలతో మెలగాలని హితవు పలికారు. ఎమ్మెల్యే కాకముందు డాక్టర్ గా ఉన్నప్పుడు ఒక మహిళను లోబర్చుకుని జైల్ కు పోయివచ్చిన చరిత్ర రాజయ్యకు ఉందని మండిపడ్డారు.
ఎమ్మెల్యే వేధింపులు చెప్పుకోవడానికి సిగ్గుచేటని రావు పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల వేధింపులపై కేసీఆర్ ఎందుకు నోరు మెడపడం లేదని ప్రశ్నించారామె. మహిళలపై వేధింపులు చేస్తున్న రాజయ్య కే పదేపదే టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తుండని ఆరోపించారు. కూతురు కాపాడేందుకు పాటుపడే సీఎం పార్టీలో ఉన్న మహిళల గురించి ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. కేసీఆర్ కూతురే కాకుండా మిగతా మహిళలను కూడా పట్టించుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ను కోరుతున్నామన్నారు.