పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు : కొండా విశ్వేశ్వర్‌‌ రెడ్డి 

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు : కొండా విశ్వేశ్వర్‌‌ రెడ్డి 
  • బీఆర్‌‌ఎస్‌ కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఫైర్‌‌
  • బీజేపీని ఎలా అధికారంలోకి తేవాలనే దానిపై భేటీలు నిర్వహిస్తున్నామని వెల్లడి 
  • ఇందులో ఎలాంటి సీక్రెట్‌‌ లేదని, అంతా ఓపెన్‌‌గానే చేస్తున్నామని వివరణ

హైదరాబాద్, వెలుగు : పార్టీ మారుతున్నట్లు తనపై, వివేక్ వెంకటస్వామిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌ రెడ్డి కొట్టిపారేశారు. వివేక్ బీఆర్ఎస్‌‌లో చేరుతున్నారని సోషల్ మీడియాలో, కొన్ని పేపర్లలో రాశారని, అయితే, తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియా ఆయన మాట్లాడారు. బీజేపీలో కొందరం రెగ్యులర్‌‌‌‌గా సమావేశం అవుతున్నది నిజమే, కానీ పార్టీ మారుతున్నారనే వార్తల్లో నిజం లేదన్నారు. తామేమీ సీక్రెట్‌‌గా సమావేశం కావడం లేదని, ఓపెన్‌‌గానే భేటీ అవుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని ఎలా బలోపేతం చేయాలి? వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించాలి? అనే దానిపైనే భేటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సర్వేలలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఏ సర్వేలు ఎలా ఉంటున్నాయి? బీజేపీ పరిస్థితి ఏమిటి? ఎలాంటి సర్వేలతో బీజేపీని బలోపేతం చేయొచ్చు అనే దానిపై తమ మీటింగ్‌‌లలో ప్రధానంగా చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ, ఏ వర్గంలో ఉంది? అనే దానిపై సర్వేలు చేయాల్సి అవసరముందన్నారు. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దానిని బీజేపీ ఎలా వాడుకోవాలనే దానిపై పార్టీ అగ్ర నేతలకు వివరిస్తామని చెప్పారు. ఇప్పటికే దీనిపై పార్టీ ఎన్నికల ఇన్‌‌చార్జి ప్రకాశ్ జవదేకర్‌‌‌‌ను కలిసి చర్చించామని, త్వరలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలుస్తామని తెలిపారు. 

వివేక్ పార్టీ మార్పు అబద్ధం : కొప్పు బాషా

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పార్టీ మార్పు అంటూ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా స్పష్టం చేశారు. బీజేపీని ఎదుర్కోలేకనే వివేక్‌‌పై అసత్య ప్రచారాలను అధికార పార్టీ చేస్తున్నదని ఆరోపించారు. ఇలాంటివి మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.