ఆరు గ్యారంటీలను అమలు చేయాలి :పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రాంనాథ్

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి :పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రాంనాథ్
  • బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసుల వద్ద ధర్నాలు

నిర్మల్/దండేపల్లి/బజార్ హత్నూర్/కుంటాల/నేరడిగొండ, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో అన్ని తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించారు. 

నిర్మల్ రూరల్ తహసీల్దాల్ ఆఫీస్ ముందు చేపట్టిన ధర్నాలో రాంనాథ్​ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కోల్పోయారని, స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పనున్నారని అన్నారు. 

ఆరు గ్యారంటీలను నెరవేర్చాలి

కాంగ్రెస్​ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో కలిసి దండేపల్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. స్థానికంగా సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కరించాలని, మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రన్ని తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేకు అందజేశారు. 

బీజేపీ మండల అధ్యక్షుడు బందెల రవి గౌడ్, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ బజార్ హత్నూర్ అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్ , పాక్స్ చైర్మన్ వెంకన్న ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కుంటాల తహసీల్దార్ కమల్ సింగ్​కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. మండల ప్రెసిడెంట్ నవీన్, మాజీ ఎంపీపీ గజ్జరాం, నాయకులు పాల్గొన్నారు. నేరడిగొండ బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్​ ఆధ్వర్యంలో నేతలు తహసీల్దార్​ ఆఫీస్​ ముందు ధర్నా చేశారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ ​చేశారు.