ఢిల్లీలో పాక్ హైకమిషన్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన

ఢిల్లీలో పాక్ హైకమిషన్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన

ఢిల్లీ నగరంలోని పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.  ప్రధాని నరేంద్ర మోడీపై పాక్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. 

ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పాకిస్థాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావాల్ భుట్టో  ప్రధాని మోడీపై నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని.. కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడని.. ప్రస్తుతం భారతదేశానికి ఆ వ్యక్తి ప్రధానిగా ఉన్నాడంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు భారతదేశవ్యాప్తంగా దుమారం రేపాయి. పాకిస్థాన్ విదేశాంగశాఖ మంత్రి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మన దేశంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలు ఉద్రిక్తతకు దారితీశాయి.