ఆర్టికల్ 370, 35A లను రద్దు చేస్తాం: మేనిఫెస్టోలో బీజేపీ హామీ

ఆర్టికల్ 370, 35A లను రద్దు చేస్తాం: మేనిఫెస్టోలో బీజేపీ హామీ

ఢిల్లీ : ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతాపార్టీ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ కు మూడు రోజుల ముందు ఎన్నికల హామీలను వివరించింది. తిరిగి అధికారంలోకి వస్తే తాము ఏం చేయదల్చుకున్నామో ప్రాధాన్య అంశాల వారీగా  బీజేపీ వివరించింది. జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370, 35A ల రద్దు అంశాన్ని మరోసారి మేనిఫెస్టోలో ప్రస్తావించింది బీజేపీ.

“గడిచిన ఐదేళ్లలో జమ్ముకశ్మీర్ లో శాంతి స్థాపనకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. నిర్ణయాత్మకమైన అన్ని చర్యలను సంస్థాగతమైన విధానంలో అమలు చేశాం. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న వాటిని రద్దు పరిచేందుకు కట్టుబడి ఉన్నాం. ఆర్టికల్ 35 ఏతో రాజ్యాంగపరంగా జమ్ముకశ్మీర్ కు సంక్రమించిన హక్కులు.. అక్కడి తాత్కాలిక నివాసితులు, మహిళల పట్ల  వివక్ష చూపించేలా ఉన్నాయి. రాష్ట్రాలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేందుకు.. ఇందుకు అడ్డుపడుతున్న ఆటంకాలను తొలగించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ను చెల్లనిదిగా ప్రకటించాలన్న తమ స్టాండ్ ను జనసంఘ్ ఏర్పాటైనప్పటినుంచి వినిపిస్తున్నాం. తాజాగా మరోసారి గుర్తుచేస్తున్నాం” అని మేనిఫెస్టోలో బీజేపీ తెలిపింది.

జమ్ముకశ్మీర్ లో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల వారి భద్రతకు, శాంతియుత వాతావరణానికి మేం హామీ ఇస్తున్నాం. అందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. కశ్మీరీ పండిట్లు తిరిగి తమ రాష్ట్రానికి భద్రంగా రావడానికి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. పశ్చిమ పాకిస్థాన్ నుంచి కశ్మీర్ కు వచ్చే శరణార్థులు కశ్మీర్ లో పునరావాసం ఏర్పాటుచేసుకునేలా ఆర్థిక సహకారం అందిస్తాం” అని మేనిఫెస్టోలో వివరించింది.

1954 లో చేసిన సవరణ ప్రకారం… ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A  జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి భారత రాజ్యాంగం ప్రత్యేక అధికారాలను, హక్కులను ఇస్తున్నాయి. జమ్ముకశ్మీర్ కు ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రం అనే హోదాను ఇస్తోంది.