సోనియా గాంధీ విషకన్య.. చైనా, పాకిస్తాన్​కు ఆమె ఏజెంట్

సోనియా గాంధీ విషకన్య.. చైనా, పాకిస్తాన్​కు ఆమె ఏజెంట్
  • బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్  తీవ్ర వ్యాఖ్యలు
  • సోనియాకు మోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్  డిమాండ్

న్యూఢిల్లీ / జేవర్గి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ఇరు పార్టీల నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విషసర్పం లాంటి వ్యక్తి అని కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున్  ఖర్గే చేసిన వ్యాఖ్యలకు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్  యత్నాళ్  తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ మాజీ చీఫ్​  సోనియా గాంధీ విషకన్య అని అన్నారు. శుక్రవారం కర్నాటకలోని కొప్పళలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాటిల్  మాట్లాడారు. ‘‘యావత్  ప్రపంచం ప్రధాని మోడీని అభినందిస్తున్నది. మోడీ ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారు. ప్రపంచ దేశాలు ఆయనకు రెడ్  కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాయి. అలాంటి నాయకుడిని పట్టుకొని విషసర్పం అంటరా? మీ (కాంగ్రెస్) లీడరే ఒక విషకన్య. దేశాన్ని ఆమె నాశనం చేసింది. చైనా, పాకిస్తాన్ తో కలిసి పనిచేసింది” అని పాటిల్  వ్యాఖ్యానించారు.

సభ్యత తెలియని పార్టీ బీజేపీ

సోనియా గాంధీని విషకన్య అంటూ బసవనగౌడ పాటిల్  చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్  నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పాటిల్​ను వెంటనే బీజేపీ నుంచి తొలగించాలని, సోనియాకు ప్రధాని మోడీ, కర్నాటక సీఎం బస్వరాజ్  బొమ్మై క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు. లేకపోతే అటువంటి వ్యక్తిగత దాడులను మోడీ ఆమోదించినట్లే అని పేర్కొన్నారు. కర్నాటకలో బీజేపీ నేతలకు మతి భ్రమించిందని, రాజకీయ మర్యాద, సభ్యత లేకుండా వారు మాట్లాడుతున్నారని కాంగ్రెస్  జనరల్ సెక్రటరీ రణ్ దీప్  సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగే ప్రతీసారి తమ నేతపై బురద జల్లడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు అలవాటేనని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్  చేశారు. బీజేపీ పూర్తిగా నిరాశలో ఉందని, అందుకే ఆ పార్టీ నేతలు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఏఐసీసీ జనరల్  సెక్రటరీ జైరాం రమేశ్  ట్విటర్​లో విమర్శించారు.

అధికారంలోకి వచ్చాక.. పంచాయతీకి రూ. కోటి ఇస్తం: రాహుల్

కర్నాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా.. ప్రతి గ్రామ పంచాయతీకి కోటి రూపాయల చొప్పున  కల్యాణ కర్నాటక ప్రాంతానికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని ఆ పార్టీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 50 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు. కలబురగి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగించారు. మే 10న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతానికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఇక్కడ దొంగ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్నదని రాహుల్​ ఆరోపించారు.