
- ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అని గెలిపిస్తే.. పార్టీ మారిండు
- మళ్లీ ఆయన్ని నమ్మి ప్రజలు మోసపోవద్దు
- ఎల్బీనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి
ఎల్బీనగర్, వెలుగు: సుధీర్‌రెడ్డి ఎల్బీనగర్ ప్రజలను ఒకసారి మోసం చేశారని, మళ్లీ ఆయన్ని నమ్మి మరోసారి మోసపోవద్దని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి అన్నారు. సోమవారం గడ్డి అన్నారం డివిజన్‌లో కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ... 2018లో సుధీర్‌రెడ్డిని ప్రతిపక్షం నుంచి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలను మోసం చేసి అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి అధికార పార్టీలో చేరాడన్నారు. 2018లో సుధీర్‌రెడ్డిని గెలిపించి ఓడిపోయిన ఎల్‌బీనగర్ ప్రజలు, ఇప్పుడు అదే సుధీర్‌రెడ్డిని ఓడించి గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు.
సుధీర్‌రెడ్డి మాయమాటలను నమ్మడానికి ఎల్‌బీనగర్ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. చెరువులను మింగేసిన సుధీర్‌రెడ్డిని మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను గజం వదలకుండా కబ్జా చేస్తాడన్నారు. సామ రంగారెడ్డికి వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త, జాతీయ అవార్డు గ్రహీత నాగరత్నం నాయుడు, డివిజన్ బీజేపీ అధ్యక్షులు దాసరి జయప్రకాశ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ జయప్రకాష్, మాజీ కౌన్సిలర్ బండి నిర్మల తదితరులు పాల్గొన్నారు.