నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తుండు

నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తుండు

రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం సాగదీత ధోరణితో వ్యవహరిస్తోందని తప్పుబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో లక్షా 91 వేల 126 ఖాళీలు ఉన్నాయని 2021లోనే పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ సర్కారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్న విషయాన్ని ఈటల గుర్తుచేశారు. దేశ భవిష్యత్తులో భాగం కావాల్సిన తెలంగాణ యువత ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ ఉద్యోగాల ఖాళీలపై ఒక రిపోర్ట్ విడుదల చేశారని, దాని ప్రకారమే లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇందులో టీఎస్పీఎస్సీ కేవలం 31 వేల ఉద్యోగాలను మాత్రమే నింపిందన్నారు. అయితే ఆర్టీసీలో నాలుగున్నర వేల ఉద్యోగాలు నింపామని ప్రభుత్వం చెప్పిందని, ఇది పచ్చి అబద్ధమని ఈటల అన్నారు. తెలంగాణ  వచ్చిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా గ్రూప్ -1, టీచర్ల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేయలేదన్నారు. రాజకీయాలపై  ఉన్న సోయి  కేసీఆర్ కు.. నిరుద్యోగ యువతకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడంపై  లేదన్నారు. సిస్టమ్ ను  కంట్రోల్ చేసే  సత్తా  లేక ధర్మగంట  పేరుతో  ఉద్యోగుల పరువు  తీశాడని ఈటల రాజేందర్  మండిపడ్డారు.

మరిన్ని వార్తల కోసం..

ఓటేసిన ఫొటో వాట్సాప్ లో షేర్ చేసిన మేయర్పై కేసు

మోగాలో సోనూ సూద్‌ను అడ్డుకున్న అధికారులు

నా సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే దొరుకుద్ది