ఉత్తర తెలంగాణ ఉద్యమం వస్తది : పైడి రాకేశ్ రెడ్డి

ఉత్తర తెలంగాణ ఉద్యమం వస్తది : పైడి రాకేశ్ రెడ్డి
  • నిధులన్నీ దక్షిణ తెలంగాణకే వెళ్తుంటే ఎట్ల: పైడి రాకేశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ దక్షిణ తెలంగాణకే కేటాయిస్తుంటే.. భవిష్యత్తులో ఉత్తర తెలంగాణ కోసం ఉద్యమం వస్తదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. కొడంగల్.. నారాయణపేట ఎత్తిపోతల పథకం కోసం రూ.2 వేల 900 కోట్లు సీఎం రేవంత్ కేటాయించుకున్నారు.

ఇక మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆయన నియోజకవర్గం కోసం వంద కోట్లు తీసుకుపోయారు. ఇక నా నియోజకవర్గంలో 40 గ్రామ పంచాయితీలకు భవనాలు లేవు. వీటి నిర్మాణానికి ప్రతిపాదనలను కలెక్టర్ ఓకే చేసినా.. సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం దీనిపై మాట్లాడేందుకు  సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఇలా ఉత్తర తెలంగాణ విషయంలో అన్యాయం జరగడం ఏమిటన్నారు. ఉత్తర తెలంగాణలో మళ్లీ తుపాకుల, బూట్ల చప్పుళ్లు వినిపించాలా..అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆహ్వానం మేరకు బీజేపీ ఎమ్మెల్యేలమంతా ఈ నెల 13న మేడిగడ్డ సందర్శనకు వెళ్తామని చెప్పారు.