సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కే అభివృద్ధి ఫలాలు

సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కే అభివృద్ధి ఫలాలు

నిజామాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు జోస్యం చెప్పారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో దుబ్బాకలో జరిగిన రైతు ధర్నాలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్పైస్ బోర్డుకు, పసుపు బోర్డుకు తేడా  తెలియని వ్యక్తి మంత్రి ప్రశాంత్ రెడ్డి అని విమర్శించారు. తాళ్ళ రాంపూర్ సొసైటీ అక్రమాలు మంత్రి ప్రశాంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు. ధర్నాలో పాల్గొనొద్దని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా... రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాకు హాజరుకావటం చూస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి పని అయిపోనట్లేనని అర్థమవుతోందన్నారు. 

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తానని... చెరుకు, పసుపు పరిశోధన కేంద్రాలను తెస్తానని చెప్పిన కేసీఆర్... ఎనిమిదేళ్లైనా తన హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ అని ప్రకటించిన కేసీఆర్... మాట తప్పారని విమర్శించారు. కేంద్రం మద్దతు ధర ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తోందని స్పష్టం చేశారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. 

రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయన్నారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలో మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు జరగుతున్నాయన్న ఆయన... రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లక్షల సంఖ్యలో మోడీ ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందన్నారు. కొత్త రాష్ట్రానికి దళితుడే తొలి సీఎం అని ప్రకటించిన కేసీఆర్... తన మాటను తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ నిర్మాణం పనులు ఎంతవరకు వచ్చాయని ఎద్దేవా చేశారు.