ఏ రూల్స్ ప్రకారం ఈటలకు నోటీసులు ఇస్తరు

ఏ రూల్స్ ప్రకారం ఈటలకు నోటీసులు ఇస్తరు

మర మనిషి అనే పదం అన్ పార్లమెంటరీ పదం కాదని బీజేపీ ఎమ్మల్యే రఘునందన్ రావు తెలిపారు. ఆ పదం రాజ్యాంగంలో నిషేధించబడిందా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా స్పీకర్ను దూషించలేదని.. ఏ రూల్ ప్రకారం నోటీసులు ఇస్తారని అడిగారు. ప్రజల సమస్యల గురించి తాము మాట్లాడొద్దనే ఉద్దేశ్యంతోనే సభలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. స్పీకర్ను తాము అవమానించలేదని.. నిజామాబాద్ కు సీఎం వచ్చినప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డే అవమానించారని అన్నారు. 

బీఏసీ సమావేశానికి తమను ఎందుకు పిలవలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఎంతమంది సభ్యులు ఉంటే సమావేశానికి పిలుస్తారు అని అడిగారు. బీజేపీని బీఏసీ మీటింగ్ కు ఎందుకు పిలవలేదని భట్టి విక్రమార్క, అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు అడగలేదన్నారు. శాసనసభను ఆరు నిమషాలకే వాయిదా వేశారని.. అయితే శాసనమండలిలో మాత్రం చర్చ నిర్వహించారని అన్నారు. శాసనసభకు ఒక రూల్..మండలికి ఒక రూల్ ఉంటుందా అని నిలదీశారు.