కేసీఆర్‌ను ప్రజలు శిక్షించే రోజు వస్తది

కేసీఆర్‌ను ప్రజలు శిక్షించే రోజు వస్తది

మంద బలాన్ని చూసుకుని ఊరేగుతున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు శిక్షించే రోజు వస్తుందని, ఆయన్ను చూసి నవ్వుకునే రోజును చూస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తక్కువ సంఖ్యా బలం ఉన్న తమ గొంతును అసెంబ్లీలో వినిపించకుండా చేయాలని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారని అన్నారు. తమను సభలోకి రాకుండా చేసి వికటాట్టహాసం చేస్తున్న కేసీఆర్ కూ.. ఇవాళ తమకు ఎదురైన అవమానం భవిష్యత్తులో ఎదురవబోతోందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం స్పీకర్ ను కలిసి వాదనలు వినిపించాలని చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఇవాళ ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించారు. సభలోకి అనుమతించేది లేదని, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో కూడా మాట్లాడొద్దని ఆదేశించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. పార్టీ ఆఫీసుకు చేరుకుని మీడియాతో మాట్లాడారు.

వాజపేయి మాటలను గుర్తు చేసిన రఘునందన్

స్పీకర్ కు రాజకీయాలు ఆపాదించడం తమకు ఇష్టం లేదని, కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే తమపై సస్పెన్షన్ ఎత్తేయలేదని భావిస్తున్నామని రఘునందన్ అన్నారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్.. ఆ పని చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఆయన నిర్ణయాన్ని అప్రజాస్వామికంగా భావిస్తున్నామని, తమ గొంతుకను సభలో వినిపించకుండా చేయడం కోసమే సస్పెండ్ చేసి బయటకు పంపారని ఆరోపించారు.  1997లో ఒక్క ఓటుతో వాజపేయి ప్రభుత్వాన్ని కూల్చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వికటాట్టహాసం చేసిందని, అప్పుడు వాజపేయి మాట్లాడుతూ భవిష్యత్తులో ఒక రోజు కాంగ్రెస్ పార్టీని చూసి ఇలాగే నవ్వే రోజు వస్తుందని చెప్పారని రఘునందన్ గుర్తు చేశారు. ఈ రోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నాడు ఆయన చెప్పిన విషయాన్ని రుజువు చేసిందన్నారు. అదే విషయాన్ని ఈ రోజు తాను చెబుతున్నానని, మంద బలం ఉందని విర్రవీగుతున్న టీఆర్ఎస్ పార్టీ.. సంఖ్యా బలం తక్కువగా ఉన్న బీజేపీ సభ్యులను బయటకు పంపిందని, అయితే భవిష్యత్తులో కేసీఆర్ ను ప్రజలు శిక్షించే రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించి, నవ్వే రోజు వస్తుందని అన్నారు. ముందు ముందు ప్రజలు టీఆర్ఎస్ కు ప్రజలు బలం లేకుండా చేస్తారని, ఈ రోజు సభలో తాము ఎదుర్కొన్న అవమానం భవిష్యత్తులో కేసీఆర్ కూ ఎదురువుతుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

దేశ చరిత్రలో ఇవాళ బ్లాక్ డే

కేసీఆర్కు ప్రజా సమస్యలు పట్టవు

అసెంబ్లీని టీఆర్ఎస్ సభ్యులు కౌరవసభలా మార్చిన్రు