ఆక్సిజన్ సిలిండర్లతో అసెంబ్లీకి

ఆక్సిజన్ సిలిండర్లతో అసెంబ్లీకి

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్లు, ముఖాలకు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఆప్ సర్కారు విఫలమైందని వారు ఆరోపించారు. అందుకే తాము ఆక్సిజన్ సిలిండర్లు , ఆక్సిజన్ మాస్కులతో వచ్చి నిరసన తెలుపుతున్నామని చెప్పారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఉందని..వాయు కాలుష్యాన్ని కంట్రల్ చేయలేని సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

ఢిల్లీలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు తప్పనిసరిగా గ్యాస్ ఛాంబర్లో నివసించాల్సిన పరిస్థితి దాపురించిందని బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్త ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నివారించేందుకు ఆప్ ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల వాదనను ఆప్ ఎమ్మెల్యేలు కొట్టిపారేశారు.  వాతావరణ సమస్యలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఆక్సిజన్ సిలిండర్లను బయటకు తీసుకువెళ్లాలని స్పీకర్ రామ్ నివాస్ గోయెల్  సూచించారు. 

బీజేపీ సభ్యుల ఆరోపణలు, ఆప్ సభ్యుల ప్రత్యారోపణల మధ్య స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం వరకు కాలినడకన వెళ్లారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడు రోజులు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఎక్కువగా ఢిల్లీలోని వాయు  కాలుష్యంపై  తమ పోరాటం ఉంటుందని బీజేపీ హెచ్చరించింది.