
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి జులై 27న మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు ఆయన నివాసానికి వెళ్లారు. అనంతరం ఆయనను పరామర్శించి ఓదార్చారు.
జాండీస్‌తో మృతి..
వారం క్రితం జాండీస్ రావటంతో ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు.. 30 ఏళ్ల విష్ణువర్థన్ రెడ్డికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి.. గుండెపోటుతో జులై 27వ తేదీ తెల్లవారుజామున కన్నుమూశారు.
ఇంటికి వచ్చిన కుమారుడి పార్థివదేహాన్ని చూసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలారు. బిడ్డా.. ఒక్కసారి లేరా.. కళ్లు తెరువురా అంటూ ఆ తండ్రి పడిన వేదన.. అక్కడున్న వాళ్లను కంట తడి పెట్టింది. కుమారుడిని విగతజీవిగా చూసి బోరున విలపించిన ఎమ్మెల్యే.. అక్కడే స్పృహ కోల్పోయారు.
దీంతో ఆయనను వెంటనే ఇంట్లోకి తీసుకెళ్లి డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. కుమారుడు లేడన్న షాక్ లో ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని.. ఈ క్రమంలోనే స్పృహ తప్పారని.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు వైద్యులు.
వారం క్రితం వరకు తమతోనే తిరిగిన విష్ణువర్థన్ రెడ్డి అలా విగత జీవిగా కనిపించటం.. మరో వైపు పెద్దన్నగా ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అలా స్పృహ తప్పి పడిపోవటంతో.. ఆయన ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కార్యకర్తల ఆర్తనాదాలు మిన్నంటాయి.