
నగ్రాకటా: బెంగాల్లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది. ఆ పార్టీ ఎంపీ ఖగేన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌పై పలువురు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. జల్పాయ్గురి జిల్లా నగ్రాకటాలోని బమన్ దంగాలో వరద బాధితులను పరామర్శించేందుకు పార్టీ నేతలతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లారు.
ఈ క్రమంలో లీడర్ల వాహనాలను ఓ గుంపు చుట్టుముట్టి, ‘దీదీ, దీదీ’ అని నినాదాలు చేస్తూ రాళ్ల దాడి చేసింది. ఈ ఘటనలో వాహనాల విండ్ షీల్డ్ ధ్వంసమై ఎంపీ ముర్ము తలకు గాయమైంది. ఈ ఘటనతో నేతలు షాక్ కు గురయ్యారు. రక్తమోడుతున్న ఎంపీ పక్కనే ఉన్న ఎమ్మెల్యే శంకర్ ఘోష్.. ఈ ఘటనను ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు.
అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. మానవత్వంతో వరద బాధితులను పరామర్శించడానికి వస్తే దాడి చేశారని మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలో జంగిల్ రాజ్ నెలకొందన్నారు. ‘‘బమన్ దంగాలో ఓ మూక మా దగ్గరికి వచ్చింది. ‘దీదీ, దీదీ’ అని నినాదాలు చేస్తూ రాళ్లతో మా కాన్వాయ్‌పై దాడి చేసింది.
అదృష్టవశాత్తు నేను కిందికి వంగడంతో దాడి నుంచి తప్పించుకున్నాను. కానీ, ఎంపీ ఖగేన్ గాయపడ్డారు. ట్రీట్ మెంట్ కోసం ఆయనను సిలిగురికి తీసుకు వెళుతున్నాం” అని ఎమ్మెల్యే చెప్పారు. ఎంపీ ఖగేన్ ముర్ము ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.