సేవ్ ఫార్మర్స్.. రైతు లేనిదే రాజ్యం లేదు: బండి సంజయ్

సేవ్ ఫార్మర్స్.. రైతు లేనిదే రాజ్యం లేదు: బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసిందని.. కోట్లాది రూపాయలు ప్రకటనలతో గ్యారంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదని.. రూ. 2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు బండి సంజయ్. కరీంనగర్ లో బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. 

అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని.. చేతికందిన పంట నీళ్లపాలైందన్నారు బండి సంజయ్. అకాల వర్షాలకు రాలిపోయిన మామిడి పిందెలను, రాలిన వడ్ల కంకులను మీడియాకు చూపించారు. సాగునీరు లేక పంట ఎండిపోయి.. రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని.. ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాల్సించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పేరుతో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు చెల్లించాల్సిందేనని అన్నారు.

రైతు కూలీలకు సైతం ఏటా రూ.12 వేల ఇవ్వాలని.. కేంద్రం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేడటం లేదని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తక్షణమే వడ్ల కొనుగోలు చేయాలన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి రైతులకు భరోసా కల్పించేందుకే రైతు దీక్ష చేస్తున్నానని చెప్పారు బండి సంజయ్.