లోక్సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ ప్రమాణం

లోక్సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ ప్రమాణం

లోక్  సభ ప్రొటెం స్పీకర్  గా భర్తృహరి మహతాబ్ ప్రమాణస్వీకారం చేశారు  . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కాసేపట్లో  18 వ లోక్ సభ ఫస్ట్ సెషన్ ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయనున్నారు. మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్  సభ్యులతో ప్రమాణం చేయిస్తారు.  11 గంటల నుంచి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రాల పేర్లను పరిగణనలోకి తీసుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎంపీల ప్రమాణం ఉంటుంది. అసోం ఎంపీల ప్రమాణ స్వీకారంతో ప్రోగ్రామ్ మొదలై.. వెస్ట్ బెంగాల్ ఎంపీల ప్రమాణంతో కంప్లీట్ అవుతుంది. జూన్ 24న 280 మంది ప్రమాణం చేయనున్నారు. 25న  తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 264 మంది ప్రమాణం చేసే అవకాశం ఉంది.  

జూన్ 26న స్పీకర్ ఎన్నిక, 27న ఉభయ సభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 28 నుంచి చర్చలు ప్రారంభం అవుతాయి. జులై 2 లేదా 3న ఎంపీల ప్రశ్నలకు మోదీ జవాబులిస్తారు. తర్వాత ఉభయ సభల వాయిదా పడే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ కోసం  జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. 

మరోవైపు ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ ను ఎంపిక చేయడంపై ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేరళలోని మావెలికర నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ సభ్యుడు కొడికున్నిల్ సురేశ్ ను  కాదని.. ఒడిశాలోని కటక్ నుంచి ఏడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ను ఎలా ఎంపిక చేస్తారని మండిపడుతోంది. ఇవాళ ఇండియా కూటమి సభ్యులు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు మహతాబ్ వరుసగా ఏడు సార్లు గెలిచారని, సురేశ్ 1998, 2004లో ఓడిపోయారని, అందుకే సీనియార్టీ ప్రకారం భర్తృహరిని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు క్లారిటీ ఇచ్చారు.