యశోద హాస్పిటల్ లో శ్రీనివాస్ ను పరామర్శించిన అరవింద్

యశోద హాస్పిటల్ లో శ్రీనివాస్ ను పరామర్శించిన అరవింద్

హైదరాబాద్: బీజేపీ కార్యాలయం ముందు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసి తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. తొలుత చికిత్స కోసం ఉస్మానియాలో చేర్పించి.. మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారని తెలిసి యశోద ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం దురదృష్టకర సంఘటన అన్నారు.

శ్రీనివాస్ పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్పారు.. 70 నుండి 80 శాతం కాలిన గాయాలు ఉన్నాయన్నారు… ఏరోజు ఆరోగ్యం విషమిస్తుందో అని చెప్పలేము అంటున్నారు.. శ్రీనివాస్ తో  మాట్లాడుతుంటే దుఃఖం ఆగడం లేదు.. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కాదు ఎంపీ కూడా అయిన  బండి సంజయ్ లాంటి నాయకులకే పోలీసుల రక్షణ లేకుంటే మాలాంటి కార్యకర్తలకేం ఉంటుందని శ్రీనివాస్ ఆవేదన  చెందాడని ఎంపీ అరవింద్ తెలిపారు. శ్రీనివాస్ కోలుకునే వరకూ బిజెపి నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని  ఆయన కోరారు. కేటీఆర్ లాంటి చీప్ ఫెలో గురించి యశోద హాస్పిటల్ లో మాట్లాడడం సరికాదు.. కేటీఆర్ చీప్ పొలిటిషియన్, గుడ్ ఫర్ నథింగ్.. రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు.