తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి

తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి

రాజస్థాన్ : తాజ్ మహల్ నిర్మించిన స్థలం తమ రాజ కుటుంబానికి చెందినది అంటూ రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి అంటున్నారు. ప్రస్తుతం ఉన్న తాజ్ మహల్ స్థలం జైపూర్ రాజ కుటుంబానికి చెందినదని, షాజహాన్ ఆ ప్రాంతాన్ని పాలించినందున ఆ భూమిని తీసుకున్నారని చెప్పారు. అప్పట్లో భూమిని తీసుకున్నందుకు కొంత పరిహారం కూడా ఇచ్చారని, దానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, కోర్టు ఆదేశిస్తే ఆ రికార్డ్స్ ను సమర్పిస్తామని చెబుతున్నారు. 

ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు జై సింగ్ కు సంబంధించినది. అందుకు సంబంధించిన ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ దివ్య కుమారి చెబుతున్నారు. ఆ కాలంలో కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని, ఒకవేళ తమ దగ్గర ఉన్న రికార్డులను పరిశీలిస్తే, అన్ని విషయాలు తెలుస్తాయని చెబుతున్నారు. అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను కూడా ఆమె సమర్థించారు. తాజ్ మహల్ లోని 22 గదులను తెరవాలని, అప్పుడే వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు. తాజ్ మహల్ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉందన్నారు. 

జీవితంలో ఒక్క సారైనా తప్పక చూడాల్సిన కట్టడాల్లో అందమైన తాజ్ మహల్ ఒకటి. ఆగ్రాలోని ఈ అపురూపమైన స్మారకాన్ని సందర్శించేందుకు దేశ విదేశీ టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. నిజమైన ప్రేమకు చిహ్నంగా, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా 'తాజ్ మహల్'కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు నిర్మించారు. దాదాపు 20,000 మంది కార్మికులు పని చేశారు. 

షాజహాన్ తన మూడవ భార్య ముంతాజ్ మహల్ పై ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ ను నిర్మించారు. ముంతాజ్ మహల్ పేరు మీదే ఈ కట్టడానికి తాజ్ మహల్ అనే పేరు వచ్చింది. అయితే ముంతాజ్ మహల్ అసలు పేరు అది కాదు. ఆమె అసలు పేరు 'అర్జుమండ్ బానో బేగమ్'. ఇప్పటికీ కూడా ప్రేమ గురించి ప్రస్తావన వస్తే తాజ్ మహల్ ను తలచుకోని వారు ఉండరు. శతాబ్ధాలు గడిచినా ఈ కట్టడం అంతలా ప్రజల హృదయాలను గెలుచుకుంది. 

 

మరిన్ని వార్తల కోసం..

వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం

దేశ ద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు

మీ ఇంటికే బీపీ, షుగర్ గోలీలు