సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదా?.. అభద్రతా భావంలో సీఎం రేవంత్: లక్ష్మణ్ 

సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదా?.. అభద్రతా భావంలో సీఎం రేవంత్: లక్ష్మణ్ 
  • సీఎం రేవంత్ అభద్రతా భావంలో ఉన్నారు : లక్ష్మణ్ 
  • ఓటమిని పసిగట్టే సెంటిమెంట్ తెరపైకి తెస్తున్నడు.. బీజేపీని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర
  • కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మరని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైటెన్షన్​వైర్​లా మారుతానంటూ సీఎం రేవంత్​రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఓబీసీ మోర్చా నేషనల్​ప్రెసిడెంట్​లక్ష్మణ్​ప్రశ్నించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హైటెన్షన్​వైర్​తో ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇవ్వాల్సినంత అవసరమేంటి? సొంత ఎమ్మెల్యేలపైనే రేవంత్​రెడ్డికి నమ్మకం లేదా? ఎందుకంత అభద్రతా భావంలో ఉన్నారు.

రాష్ట్రంలో తన పాలనే రెఫరెండంగా 14 సీట్లు గెలుస్తామని చెప్పిన రేవంత్.. ఇప్పుడు చతికిలబడ్డారు. తనపై కుట్రలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ఓటమిని అంగీకరించినట్టుగానే ఉన్నాయి. దేశంలో కనుమరుగైతున్న కాంగ్రెస్.. తెలంగాణలోనూ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. కానీ దేశంలో కాంగ్రెస్​ గెలిచి రాహుల్​ ప్రధాని అవుతారని రేవంత్​అనడం విడ్డూరంగా ఉంది” అని లక్ష్మణ్ అన్నారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే..  

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్​కు భవిష్యత్తు లేదని.. బీజేపీదే భవిష్యత్తు అని లక్ష్మణ్ అన్నారు. ‘‘ఓటమిని పసిగట్టే సీఎం రేవంత్​రెడ్డి సెంటిమెంట్ అనే ఆయింట్​మెంట్​ను తెలంగాణ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆయనపై ఎవరు కుట్రలు పన్నుతున్నారో వెల్లడించాల్సిన అవసరం ఉన్నది. 25 మంది కాంగ్రెస్​ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారని కేసీఆర్​ చెప్పిన మరుసటి రోజే.. బీఆర్ఎస్​ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​కాంగ్రెస్​తో టచ్​లోకి వెళ్లారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్​ జీర్ణించుకోలేకపోతున్నాయి.

రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకుని మోదీ చరిష్మా, బీజేపీ ప్రభంజనాన్ని నిలువరించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే. కుటుంబ పాలన, అవినీతి, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, హిందూ వ్యతిరేక నిర్ణయాలతో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి’’ అని పేర్కొన్నారు. 

త్వరలో వికసిత్ తెలంగాణ సంకల్ప పత్రం.. 

బీజేపీ ప్రస్తావన లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేయలేకపోతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. హరీశ్ రావు బీజేపీ ఏజెంట్ అని రేవంత్ అంటే.. రేవంతే బీజేపీ ఏజెంట్​అని హరీశ్ అంటున్నారని పేర్కొన్నారు. ‘‘అవినీతి బీఆర్ఎస్​ పోయి.. మళ్లీ అవినీతి కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారం కోల్పోయే సరికి తండ్రీ కొడుకులు నీళ్లలోంచి బయటపడిన చేపల్లా కొట్టుకుంటున్నారు.

అధికార దాహంతో బీఆర్ఎస్​వ్యవహరిస్తుంటే, అధికార మదంతో కాంగ్రెస్​వ్యవహరిస్తున్నది” అని అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మరని కామెంట్ చేశారు.‘‘కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందనడానికి పెరుగుతున్న ఓటింగ్​శాతమే నిదర్శనం. తెలంగాణలో బీజేపీకి మెజారిటీ సీట్లు ఇస్తారు. వికసిత్​ భారత్ ​లాగానే ‘వికసిత్​తెలంగాణ’ సంకల్ప పత్రాన్ని విడుదల చేస్తాం” అని చెప్పారు.