
- కుటుంబ పాలనపై తిరగబడాలె
- యువతకు ఎంపీ లక్ష్మణ్ పిలుపు
- పార్టీ స్టేట్ ఆఫీసులో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కార్‌కు చరమగీతం పాడేందుకు యువత తిరగబడాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని, నిజాం పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ సర్కార్‌ను భూస్థాపితం చేయడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పాపన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు.
దీనికి చీఫ్ గెస్టుగా లక్ష్మణ్, మాజీ ఎంపీ విజయశాంతి హాజరయ్యారు. పాపన్న జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని విజయశాంతితో కలిసి ఆవిష్కరించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు బీజేపీకి అండగా యువత ముందుకు రావాలని కోరారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తులకు ఆరాధ్యదైవమైన పాపన్న.. మహమ్మదీయులు తాటి చెట్టుపై పన్ను విధిస్తే, దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పోరాడారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, పార్టీ నేతలు శ్యాంసుందర్ గౌడ్, ఆలె భాస్కర్, కాసం వెంకటేశ్వర్లు, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
లక్ష్మణ్‌కు సన్మానం
బీజేపీ పార్లమెంటరీ పార్టీ కమిటీలో, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటు దక్కించుకొని మొదటిసారి పార్టీ స్టేట్ ఆఫీసుకు వచ్చిన లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ ఆధ్వర్యంలో సన్మానించారు.