విమోచనమే..
నిరంకుశ కుటుంబ రాచరిక పాలన నుంచి విముక్తి చెంది ప్రజాపాలనవైపు అడుగులు పడినరోజు సెప్టెంబర్17. నిజాం ప్రపంచంలోకెల్ల అత్యంత ధనవంతుడిగా ఉన్నాడంటే, అతను తెలంగాణ పల్లెల్లో పడి పన్నుల పేరుతో ఎంత దోపిడీ చేశాడో ఊహించవచ్చు. 1948 సెప్టెంబర్ 17న నాడు హైదరాబాద్ సంస్థానం విమోచనం తర్వాత అప్పటి వరకు అమలులో ఉన్న జాగీర్దారి, సర్ఫేఖాస్ భూములన్నింటిని, దాదాపు 2 కోట్ల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ భూములను అప్పటివరకు సాగు చేస్తూ వచ్చిన కౌలు రైతులందరికి రక్షిత కౌలుదారు చట్టం ద్వారా అప్పగించింది. 1941 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది జనాభాలో ముస్లింలు 59 మంది, హిందువులు 23 మంది మాత్రమే విద్యావంతులు.
విద్యాపరంగా హిందువులు వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం పర్షియన్, ఉర్దూ భాషలను బోధనా మాధ్యమంగా విద్యారంగంలో ప్రవేశపెట్టడమే. 1892లో హైదరాబాద్ లో ఆర్యసమాజం ఏర్పాటైంది. ఈ సంస్థ మతమార్పిడీలను అడ్డుకుంది. శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు, ఆర్యసమాజ్‌కు చెందిన పలువురిని మజ్లిస్ కార్యకర్తలు కాల్చిచంపారు. 1927లో నిజాం ఆశీస్సులతో మజ్లిస్–-ఇ–-ఇత్తేహాదుల్– -ముసల్మీన్ అనే మతోన్మాద సంస్థ స్థాపితమైంది. దీని ధ్యేయం హైదరాబాదు రాజ్యాన్ని ఇస్లామిక్ రాజ్యంగా తీర్చిదిద్దడం. 1946-–48 మధ్యకాలంలో రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోచుకోవడం, రైతుల పంటలను లాక్కోవడం, స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడటం, గ్రామాలను తగులబెట్టడం, ప్రశ్నించే వాళ్లను అంతమొందించడం చేసేవారు. బైరాన్‌పల్లి, పరకాల, కూటిగల్, ఆకునూరు, గుండ్రాంపల్లి, మాచిరెడ్డి పల్లె, కడవెండి, దేవరుప్పల లాంటి ఎన్నో గ్రామాలు ఆ రోజుల్లో రజాకార్ల దౌర్జన్యాలకు గురయ్యాయి. అందుకే సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం రాచరిక, నిరంకుశత్వ, కుటుంబ పాలన, వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన రోజు. భూస్వామ్య వ్యవస్థ చెర నుంచి ఊపిరి పీల్చుకున్న రోజు. ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న, పౌరహక్కులు పొందిన దినం. రాచరికపు వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య పాలనవైపు అడుగులు పడినరోజు. అలాంటి రోజు విమోచనా దినంగాక మరేమవుతుంది? అది ముమ్మాటికి విమోచన దినమే.
- కె. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు
సెప్టెంబర్17 విలీన దినమే..
నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఐక్యంగా పోరాటాలు చేశారు. కానీ బీజేపీ నేతలు హైదరాబాద్ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోయబుల్లాఖాన్ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో ఎలా చూస్తాం. సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమయ్యే దశకు చేరుకున్నంక ‘‘చుట్టుముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ.. గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడుతం కొడుకో.. నైజాం సర్కరోడా’’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకునే వారు. నిజాంకు ప్రజలు ఘోరీ కట్టేందుకు సిద్ధమైన తర్వాతే సర్దార్ పటేల్ సైన్యం ప్రవేశించడం, నిజాం లొంగిపోవడం, అదే నిజాంను రాజ్ ప్రముఖ్‌గా నియమించడం జరిగాయి. తెలంగాణలోని భూస్వాములు మళ్లీ భూములను స్వాధీనం చేసుకుంటే వాటిని దక్కించుకోవడానికి పోరాడిన ప్రజలను భారత సైన్యం మట్టుబెట్టాయి. ఇండియన్ యూనియన్‌లో విలీనం కోసం నిజాం, భూస్వాముల నిరంకుశత్వం నుంచి విముక్తి కోసం పోరాడిన ప్రజలపై భారత సైన్యం తుపాకులు ఎక్కుపెట్టి నాలుగు వేల మందిని చంపాయి. ఈ ఉద్యమాన్ని హిందూ – ముస్లిం గొడవగా చూపించడం ఏమాత్రం సరికాదు. దీనికి వక్రభాష్యాలు పలికి కొత్త వివాదాలకు తావివ్వకూడదు. - ప్రొఫెసర్ నాగేశ్వర్
తెలంగాణ ప్రాంతం ఇండియాలో విలీనమైనరోజు
చరిత్రలో సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన రోజు. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. అంతకు ముందు నిజాం సర్కారుతో యథాతథ ఒప్పందం చేసుకున్న సర్దార్ పటేల్, నెహ్రూ ప్రభుత్వం కూడా నిజాం సర్కార్ కూలిపోయే దశలోనే సైన్యాన్ని పంపించింది. సాయుధ పోరాటంతో కూలిపోయిందనే వాతావరణం రాకుండా ఉండేందుకు కావాలనే సైన్యాన్ని పంపించింది. ఆచరణలో నిజాం రాజును రక్షించింది. తెలంగాణ ప్రజలు ఏ రాజుపై పోరాటం చేశారో..అదే నిజాంను రాజప్రముఖ్‌గా నియమించింది. పటేల్ సైన్యం రాకపోతే, సాయుధ పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలు నిజాం రాజును, ఖాసీం రజ్వీని ప్రజాకోర్టులో శిక్షించేవారు. దున్నేవాడికే భూమి ఇచ్చేవారు. కానీ పటేల్, నెహ్రూ సైన్యాలు పేద రైతుల నుంచి భూములు గుంజుకొని మళ్లీ భూస్వాములకు ఇచ్చాయి. నిజాం రాజును, ఖాసీంరజ్వీని రక్షించాయి.
-ఎస్.వీరయ్య, నవతెలంగాణ మాజీ ఎడిటర్
ఆ రెండు పార్టీలకు సంబంధమే లేదు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, తెలంగాణను పాలిస్తున్న టీఆర్ఎస్కు సెప్టెంబర్17కు ఎలాంటి సంబంధం లేదు. నాటి నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో లేని ఈ రెండు పార్టీలకు వారసత్వం కూడా లేదు. ఎలాంటి పాత్ర లేని ఈ రెండు పార్టీలు చరిత్రను వక్రీకరిస్తున్నాయి. వాస్తవాలను వెల్లడించడానికి నిరాకరిస్తున్నాయి. ఎక్కడ హైదరాబాద్ రాష్ట్రం కమ్యూనిస్టుల వశం అవుతుందో అని ఆందోళన చెందిన ఇక్కడి దొరలు, జమీందార్లు అప్పటి యూనియన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దాంతోనే యూనియన్ సైన్యం రంగంలోకి దిగింది. సైన్యం వచ్చిన వెంటనే నిజాం లొంగిపోయారని చెప్పడం వక్రీకరణే తప్ప, వాస్తవం కాదు. నిజాం లొంగిపోయిన తరువాత మూడు వేల మంది కమ్యూనిస్టులు హత్యకు గురయ్యారు. ఇది యూనియన్ సైన్యం పనే కదా. ఇక్కడ జరిగిన రైతాంగ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి. వీరులను స్మరించుకోవాలి.
- కె. శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ నేషనల్ ప్రెసిడెంట్
విలీన దినాన్ని సమైక్యంగా..
సెప్టెంబర్ 17 అనేది రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన రోజు. నిజాం సైన్యం భారత ప్రభుత్వానికి లొంగిపోయే విధంగా
నిర్వహించిన పాత్ర బాగానే ఉన్నా.. సాయుధ రైతాంగ పోరాటం విరమించే వరకు నిజాంకు రాజాభరణాలు ఇవ్వడం తెలంగాణ ప్రజలకు నిరుత్సాహాన్ని కలిగించింది. అయినా దేశంలో విలీనం కావడం చారిత్రాత్మక సందర్భం. రజాకార్లు, భూస్వాములు పేద ప్రజలపై చేసిన జులుంకు వ్యతిరేకంగా ప్రజలు సాధించిన గొప్ప విజయం అది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాటి స్ఫూర్తితోనే తెలంగాణ సమాజం అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకుంది. సెప్టెంబర్ 17ను జరుపుకోవడంలో విభిన్న భావాలున్నా, విలీన దినంగా సమైక్యంగా జరుపుకోవడం అవసరం.
- దేవి ప్రసాద్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు
పేదలకు భూములు దక్కిననాడే
సెప్టెంబర్17ను రాష్ట్రంలో ఒక్కో పార్టీ ఒక్కో విధంగా చూస్తున్నది. ఒకరు విలీనమని, మరొకరు విమోచనమని, ఇంకొకరు విద్రోహమని, జాతీయ సమైక్యత అని అంటున్నరు. ఎవరేమి అన్నా ఈ సందర్భంగా నాటి అమరవీరులను స్మరించుకోవడం సంతోషకరం. అయితే అసలు ఈ పాలకులకు ఈ సంబురాలు చేసే నైతికత ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమది. భూమి కేంద్రంగా ఈ పోరాటం నడిచింది. అది కేవలం నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటం కాదు. స్థానిక దొరలు, దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిచింది. ప్రజలు సుమారు10 లక్షల ఎకరాల భూములను దొరలు, దేశ్ ముఖ్ లు, నిజాం నుంచి స్వాధీనం చేసుకున్నారు. కానీ యూనియన్ సైన్యం వచ్చినంకనే పేదలు ఆక్రమించుకున్న ఆ భూములు తిరిగి భూస్వాములకే దక్కాయి. సర్ఫేకాస్, పైగా, వక్ఫ్ ల్యాండ్, ల్యాండ్ సీలింగ్ పేరిట ప్రభుత్వాలు పేదల దగ్గరి నుంచి లక్షలాది ఎకరాల భూములను లాక్కున్నాయి. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పేదల నుంచి స్వాధీనం చేసుకున్న భూములన్నింటినీ తిరిగి వారికే పంచాలి. నరహంతక కాశీం రజ్వీ చేతుల్లో చనిపోయినవారి కుటుంబాలను ఈ 75 ఏండ్లలో ప్రభుత్వాలు ఆదుకోలేదు. కానీ ఇవేమి పట్టించుకోకుండా, ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా ఈ రోజు పార్టీలు విమోచనం అని, విలీనం అని, జాతీయ సమైక్యత అని కొత్త రాగం అందుకుంటున్నాయి. ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ను రక్షించేందుకే ఆపరేషన్ పోలో పేరిట యూనియన్ సైన్యాలు వచ్చాయి. సంస్థానం విలీనం తర్వాత నిజాం చేసిన నేరాలపై ఎలాంటి విచారణ జరగలేదు. నిజాంను సురక్షితంగా తరలించడానికే ఆపరేషన్ పోలో ఉపయోగపడింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసంఘ్ కార్యకర్తలంతా ఉద్యమంలో పాల్గొన్నారు. దాన్ని కమ్యూనిస్టులకే పరిమితం చేయడం సరికాదు.
- గాదె ఇన్నయ్య, సామాజిక ఉద్యమకారుడు
అమరుల త్యాగాలదినం ఇది
మనిషికి అత్యంత విలువైనది ప్రాణం. ఒక ఆశయం కోసం ఆ ప్రాణాన్ని త్యాగం చేయడమే అమరత్వం. తెలంగాణ అంటే కోట్లాది ప్రజల భూమి సమస్య. భూమిని దొరలు, దేశ్ ముఖ్ లు, దోపిడీదారుల నుంచి విముక్తి చేయడానికే ఉద్యమాలు వచ్చినయి. అందుకే నేను రాసిన పొడుస్తున్న పొద్దు పాటలో ‘‘మా భూములు మాకేనని మర్లవడ్డ గానమా.. తిరగబడ్డ రాగమా/రాచరికం కత్తి మీద నెత్తుర్లా గాయమా../దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా’’ అని రాసిన. అమరుల త్యాగాలు ఇంకా ఫలించలేదు. సెప్టెంబర్17ను అమరుల త్యాగాలదినంగా ప్రకటిస్తున్న. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి మొదలైన త్యాగాల పరంపర.. రాష్ట్రంలో నిన్నటి వరకు సాగింది. రేపు కూడా జరుగుతది. అమరుల ఆశయాలు ఇంకా ఫలించలేదు. ఫలించేవరకు పోరాటాలు కొనసాగుతూనే ఉంటయి. - గద్దర్, ప్రజా యుద్ధ నౌక
సెప్టెంబర్17తోనే అంతా ముగియలేదు..
హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్17న ఇండియన్ యూనియన్ లో కలిసింది. ఇది వాస్తవం. దీన్ని బీజీపీ విమోచన దినంగా పరిగణించాలంటున్నది. ముస్లిం రాజు నుంచి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలవడం ఒక ఎత్తయితే.. హైదరాబాద్ స్టేట్ లో ఉండే ప్రజలకు ఇది విమోచనమా అని చూడాలి. ఆదివాసీలు, దళితులకు ఉండే హక్కులు, పురుషాధిక్యత తొలగి మహిళలకు సమాన అవకాశాలు, ప్రాంతీయ ఆధిపత్యం లేని సమాజం నిర్మాణం జరిగినప్పుడే విమోచనం జరిగినట్లు. కానీ కేవలం ఒక ముస్లిం రాజు లొంగిపోవడాన్ని విమోచన అనడం సరికాదు. తెలంగాణ విలీనం తర్వాత కూడా రెండుసార్లు సీమాంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారు. అలాగే గ్రామాల్లో పేదలు, దళితులు, ఆదివాసీలు ఇంకా తమ స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది విమోచనం అనడానికి లేదు. నిజానికి ఆ రోజు త్యాగాలు చేసింది కమ్యూనిస్టులు. రజాకార్ల అరాచకత్వాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు. కానీ ఆ పోరాటాన్ని వారు ఓన్ చేసుకోలేకపోతున్నారు. రజాకార్లను పూర్తిగా అణచివేయడానికి యూనియన్ సైన్యాలు పని చేశాయి. కానీ అదే విమోచనం కాదు. ఇండియన్ యూనియన్ లో విలీనం తర్వాత కూడా హైదరాబాద్ స్టేట్ కు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. భూసంస్కరణలను అమలు చేయలేదు. ఆ రోజు ప్రజలు ఏ ఆశయాల కోసం పని చేశారో వాటిని నెరవేర్చలేదు. జరగాల్సిన మార్పు చాలా ఉంది. సెప్టెంబర్17తోనే అంతా ముగిసింది అనుకోవడం చరిత్రను పక్కదారి పట్టించినట్లే అవుతుంది.
- ప్రొఫెసర్ హరగోపాల్, పౌర హక్కుల సంఘం
