తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితే రావచ్చు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్​సంచలన వ్యాఖ్యలు

 తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితే రావచ్చు..   బీజేపీ ఎంపీ లక్ష్మణ్​సంచలన వ్యాఖ్యలు
  •     తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం  
  •     ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు
  •     బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోనూ హిమాచల్​ప్రదేశ్​పరిస్థితే రావొచ్చని బీజేపీ ఎంపీ లక్ష్మణ్​సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో రసవత్తరమైన రాజకీయాలు జరుగుతున్నాయి. లోక్​సభ ఎన్నికల తర్వాత అనూహ్య మార్పులు సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్​రెడ్డి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది” అని ఆయన​అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్​ఆఫీసులో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. 

తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా కాంగ్రెస్​ప్రభుత్వ పరిస్థితి ఉందని కామెంట్ చేశారు. ‘‘కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ పై మంత్రి, ఎమ్మెల్యేలు తిరగబడుతున్నరు. అభివృద్ధికి పైసలేవని అడుగుతున్నరు. హిమాచల్​ప్రదేశ్​లోనూ కాంగ్రెస్​ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్​ఓటింగ్​చేశారు. అక్కడ ప్రభుత్వం కొనసాగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడొచ్చు. తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్​పార్టీకి 64 సీట్లే ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్న కాంగ్రెస్​కు తెలంగాణలోనూ కర్నాటక, హిమాచల్​ప్రదేశ్​పరిస్థితే రావొచ్చు’’ అని అన్నారు. 

అహంకారంతో మాట్లాడుతున్నరు.. 

కాంగ్రెస్​పార్టీ తంతే పరుపులో పడ్డట్టు అధికారంలోకి వచ్చిందని లక్ష్మణ్​ అన్నారు. ‘‘అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో సీఎం, మంత్రులు మాట్లాడుతున్నరు. సీఎం తన హోదా మరిచి ప్రవర్తిస్తున్నరు. అది చూసి ప్రజలు విస్తుపోతున్నరు. ఇచ్చిన హామీలను మరిచి, బీజేపీని టార్గెట్​చేసుకుని విమర్శలు చేస్తున్నరు” అని ఫైర్ అయ్యారు. ‘‘దేశంలో కాంగ్రెస్​పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్​నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలు పని చేసేవి. కానీ ఇప్పుడు ఢిల్లీ, యూపీ, బెంగాల్​వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు వచ్చింది” అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే 17 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

బీఆర్ఎస్.. ముగిసిన అధ్యాయం

కాంగ్రెస్​కు ఎంపీ అభ్యర్థులే లేరని లక్ష్మణ్​అన్నారు. ‘‘ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే రాహుల్​గాంధీ ప్రధాని అయ్యి, ఆరు గ్యారంటీలను అమలు చేస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నరు. గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు గారడీ చేసి, ఇప్పుడు మాట మారుస్తున్నరు. గ్యారంటీల అమలుకు షరతులు పెడుతున్నరు. ఎన్నికలకు ముందు పథకాలు అందరికీ అని చెప్పి, ఇప్పుడు మాత్రం కొందరికేనంటూ కండీషన్లు పెడుతున్నరు” అని మండిపడ్డారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రను కాంగ్రెస్​అడ్డుకుంటున్నదని.. కానీ తమవి జగన్నాథ రథ చక్రాలని, ఎవరు ఆపినా ఆగవని అన్నారు.