తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల గిరిపై ఢిల్లీలో కేసు నమోదు

తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల గిరిపై ఢిల్లీలో కేసు నమోదు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమబెంగాల్ మంత్రి, టీఎంసీ నాయకుడు అఖిల గిరి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఖిల గిరిపై బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద అఖిల గిరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సీఎం మమతా బెనర్జీ బహిరంగంగా క్షమాపణలు  చెప్పాలని ఛటర్జీ  డిమాండ్  చేశారు. 

అఖిల గిరిని  మంత్రి పదవి  నుంచి తొలగించాలని, లేకపోతే దేశంలోని మహిళలు, గిరిజన సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తారని బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ అన్నారు. అఖిల గిరిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ)కి లేఖ రాశారు. ఇక రాష్ట్రపతిపై వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి అఖిల గిరి క్షమాపణలు చెప్పడం గమనార్హం.