కేసీఆర్‌‌‌‌లో ఫ్రస్ట్రేషన్‌‌ మొదలైంది : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్‌‌‌‌లో ఫ్రస్ట్రేషన్‌‌ మొదలైంది : వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఓటర్లు కారుకు పంక్చర్ వేశారని బీజేపీ బైపోల్ ఇన్‌‌చార్జ్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌‌‌‌లో ఓటమి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిందని, బ్యాలెన్స్ తప్పి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఎన్నికల్లో గెలవటం, ఓడటం సహజమని కేసీఆర్ అంటున్నారని, టీఆర్ఎస్ మునుగోడులో ఓడుతున్నదని ఆయనకు అర్థమైందని అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని, ఇప్పుడు మునుగోడులో ఓడిపోతుందని చెప్పారు. ‘‘ఓటుకు 10 వేలు ఇచ్చి, పోలీసులను ఉపయోగించుకొని, హైదరాబాద్‌‌లో మీటింగ్‌‌లు ఏర్పాటు చేసి, కొత్త మండలం, ఇతర జీవోలు ఇచ్చారు. అన్ని మండలాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు.. బీజేపీ నేతలు, కార్యకర్తలను బెదిరించారు” అని తెలిపారు. ఈ ఎన్నికలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, పోలీసులను ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

భయాందోళనకు గురి చేశారు

కేవలం బీజేపీ నేతల వెహికల్స్‌‌ను మాత్రమే పోలీసులు చెక్ చేశారని, అధికార పార్టీ నేతలను వదిలేసి బీజేపీ లీడర్లపైనే కేసులు నమోదు చేశారని వివేక్ వెంకటస్వామి చెప్పారు. 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు గ్రామాల్లో తిరుగుతూ మందు, బిర్యానీ పంచారని, ప్రజలను భయాందోళనకు గురి చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్‌‌కు  ఓటు వేయకపోతే పెన్షన్లు రద్దు చేస్తామని, రేషన్ రద్దు చేస్తామని, గ్రామాలను డెవలప్ చేయబోమని బెదిరించారని చెప్పారు. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ, అహంకార పాలన సాగిస్తున్నదన్నారు.