సర్కారు​కు నిర్వాసితుల గోస పట్టదా?

సర్కారు​కు నిర్వాసితుల గోస పట్టదా?
  • కాంట్రాక్టర్ల జేబులు నింపితే సరిపోతదా: వివేక్ వెంకటస్వామి ఫైర్
  • జనవరి 3 లోపు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలె
  • సిద్దిపేట జిల్లా గుడాటిపల్లి వద్ద నిర్వాసితుల దీక్షలకు సంఘీభావం

సిద్దిపేట, వెలుగు: రీడిజైన్ పేరిట కమీషన్లు పొందుతూ కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారాల చెల్లింపు విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చినట్లుగానే గుడాటిపల్లి గ్రామ నిర్వాసితులకు పరిహారాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారాలు ఇవ్వడం లేదని, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు ధరలు పెంచిన ప్రభుత్వం నిర్వాసితుల పరిహారాలు పెంచక పోగా ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్ ఇండ్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుంటే.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన నిధులను వాడుకుని గుడాటిపల్లి నిర్వాసితులకు న్యాయం చేయాలని సూచించారు.

కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్న సర్కారు

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తోందని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కమీషన్లు వెనకేసుకోవడంలో ముందున్న ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వడంలో మాత్రం లేదన్నారు. గుడాటిపల్లి నిర్వాసితులతోపాటు వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని, సమస్యలను వారికి విన్నవిస్తామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను జనవరి 3వ తేదీలోగా ప్రభుత్వం పరిష్కరించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు చేయడం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు అడ్వొకేట్ జనరల్ రాతపూర్వకంగా చెప్పారని, కానీ పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇది, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించడమేనన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిర్వాసితులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం తగదన్నారు. పోలీస్ వ్యవస్థను టీఆర్ఎస్ నిర్వీర్యం చేస్తూ తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలను వివేక్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచ్ బద్దం రాజిరెడ్డితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.