
షిగ్గావ్ (కర్నాటక): కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కమీషన్, క్రిమినలైజేషన్ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు లేని రాష్ట్రంగా కర్నాటక ఉండకూడదని, ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం బస్వరాజ్ బొమ్మై.. షిగ్గావ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం నడ్డా సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా షిగ్గావ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నడ్డా పాల్గొని మాట్లాడారు. ‘‘బీజేపీని గెలిపించాలని అందరినీ కోరుతున్నాను. మోడీ ఆశీర్వాదం లేకుండా కర్నాటక ఉండకూడదు. అభివృద్ధిలో ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటున్నాను. బీజేపీని గెలిపిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. అందరూ అభివృద్ధికి ఓటేయాలి. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలి. బొమ్మై దాఖలు చేసినవి ఎమ్మెల్యేగా పోటీ చేసే నామినేషన్ పత్రాలే కావు.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేవి”అని నడ్డా అన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నం
‘‘బస్వరాజ్ బొమ్మైని వచ్చే ఐదేండ్ల కోసం అధికారంలోకి తీసుకొచ్చేందుకు మీరందరూ నిర్ణయించుకున్నారని ఈ జనాన్ని బట్టే తెలుస్తున్నది. ఈ ఉత్సాహం చివరిదాకా ఉండాలి” అని జేపీ నడ్డా కోరారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నదని తెలిపారు. కర్నాటక ప్రగతిపథంలో దూసుకుపోతున్నదన్నారు. బహిరంగ సభకు ముందు షిగ్గావ్‌లో నడ్డా భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్, బీజేపీ సీనియర్ లీడర్లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.
షెట్టర్ తప్పు చేశారు: యడియూరప్ప
బీజేపీని వదిలేసి జగదీశ్ షెట్టర్ చాలా పెద్ద తప్పు చేశారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. ఓ చానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లింగాయత్ కమ్యూనిటీ 101% బీజేపీతోనే ఉందన్నారు. రాజ్యసభ మెంబర్షిప్ ఇస్తామని హామీ ఇచ్చామని, కేంద్ర మంత్రిగా కూడా చాన్స్ ఇస్తామని చెప్పినా షెట్టర్ కాంగ్రెస్‌లో చేరారని యడియూరప్ప తెలిపారు. అమిత్‌షా స్వయంగా మాట్లాడారన్నారు. స్పీకర్‌గా, మంత్రిగా అవకాశం కల్పించామని, పార్టీలో ఎంతో గౌరవం ఇచ్చామని వివరించారు. పార్టీని వీడొద్దని చెప్పినా వినలేదని చెప్పారు.
నామినేషన్ వేసిన సీఎం బస్వరాజ్ బొమ్మై
సీఎం బస్వరాజ్ బొమ్మై బుధవారం జేపీ నడ్డా, కిచ్చా సుదీప్ సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీనికి ముందు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన 2008 నుంచి షిగ్గావ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మూడు సార్లు గెలిచారు. 1824లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కిత్తూరు రాణి చెన్నమ్మ విగ్రహానికి పూలమాల వేసి రోడ్‌షోను ప్రారంభించారు. ముహూర్తం బాగుండటంతో ఇప్పటికే ఏప్రిల్ 15న ఒకసెట్ నామినేషన్ బొమ్మై దాఖలు చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బొమ్మై 9,260 ఓట్ల తేడాతో గెలుపొందారు. జనతాదళ్‌తో బొమ్మై తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. 2008లో బీజేపీలో జాయిన్ అయ్యారు. తర్వాత షిగ్గావ్నుంచి గెలిచారు. మళ్లీ 2013, 2018లో కూడా విజయం సాధించారు. యడియూరప్ప (2021) సీఎంగా ఉన్నప్పుడు బొమ్మై హోంమంత్రిగా ఉన్నారు.
ఇప్పటివరకు రూ.204 కోట్ల విలువైన వస్తువులు సీజ్: ఈసీ
ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి (మార్చి 29) నుంచి రూ.204 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేసినట్లు బుధవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందులో 10 లక్షల లీటర్ల లిక్కర్ కూడా ఉందని తెలిపింది. రూ.77 కోట్ల క్యాష్, రూ.43 కోట్లు విలువ చేసే లిక్కర్, రూ.50కోట్లు విలువ చేసే బంగారం, వెండి, రూ.20 కోట్లు విలువ చేసే గిఫ్ట్స్, రూ.15కోట్లు విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. మొత్తం 1,629 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని వివరించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు మార్చి 9 నుంచి మార్చి 27 దాకా రూ.58 కోట్లు విలువ చేసే వస్తువులు సీజ్ చేశామని తెలిపారు.