రాష్ట్ర  రైతులకే దిక్కులేదు..  దేశ రైతులను ఆదుకుంటాడట  : డీకే అరుణ

రాష్ట్ర  రైతులకే దిక్కులేదు..  దేశ రైతులను ఆదుకుంటాడట  : డీకే అరుణ

శాంతినగర్, వెలుగు:  ఆత్మీయ సమ్మేళనాలు,  డ్యాన్స్ లు   కాదని..   వడగండ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతుల కన్నీళ్లు తుడవాలని  బీఆర్ఎస్  లీడర్లపై  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. గురువారం అలంపూర్  నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలంలోని జులకల్, వెంకట్రావు నగర్ లో  మక్కజొన్న  రైతులను కలిసి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఒకవైపు వడగండ్లకు పంటలను కోల్పోయి, మరో వైపు మక్కలు కొనేవారు లేక  రైతులు కల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్నా  వారి బాధలు పట్టించుకోకుండా   బీఆర్ఎస్ లీడర్లు సమ్మేళనాలు, ప్లీనరీలంటూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.

  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా స్కీంను  సీఎం కేసీఆర్  రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో  పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. రాష్ట్ర   రైతుల  బాధలు తీర్చలేని కేసీఆర్ దేశంలో  రైతుల బాధలు తీరుస్తానంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు.  వెంటనే మక్కల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని,  తడిసిన మక్కలను కూడా మద్దతు ధరకే కొనాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి,  మధుసూదన్ గౌడ్, నరసింహులు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.