ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ : లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ : లక్ష్మణ్
  • రాజకీయ కక్ష సాధించేందుకే ఇలా చేశారు: లక్ష్మణ్ 
  • కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలి
  • నాటి సర్కార్​ చెప్తేనే పోలీసులు ట్యాప్ చేశారని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు : కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ లీడర్లు, వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడులక్ష్మణ్ ఆరోపించారు. ట్యాపింగ్​తో అసెంబ్లీ, ఉప ఎన్నికల టైమ్​లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఈ స్కామ్​లో కొందరు పోలీసు అధికారులు భారీగా డబ్బులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. గురువారం బీజేపీ స్టేట్​ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ స్కామ్ వెనుక ఉన్నది కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు అంటున్నరు.

మిగిలిన వాళ్లంతా బయటకు రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ నుంచి కదల్లేదు..సెక్రటేరియెట్​కు వెళ్లలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి స్కీమ్​ను స్కామ్​గా మార్చేశారు. ఫోన్ ట్యాపింగ్​తో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు. ఇది తీవ్రమైన నేరం’’అని మండిపడ్డారు. 

రేవంత్.. గ్రీకువీరుడని నిరూపించుకోవాలి

బీఆర్ఎస్ లీడర్లు చెప్తేనే తాము ఫోన్లు ట్యాప్ చేశామని పోలీసులు అంటున్నారని లక్ష్మణ్ తెలిపారు. ‘‘ఒకరిద్దరి లంగల ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చని కేటీఆర్ అంటున్నడు. పోలీసులు చట్టాన్ని అతిక్రమించి ఫోన్లు ట్యాప్ చేస్తుంటే.. అప్పటి సర్కార్ గుడ్డి గాడిద పల్లు తోమిందా? ప్రభుత్వ సహకారం లేకుండానే పోలీసులు ఫోన్లు ట్యాప్ చేశారా?’’అని కేటీఆర్​ను నిలదీశారు. అవినీతిపరులను జైల్లో వేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు.

చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్ లీకు వీరుడు కాదు.. గ్రీకు వీరుడు అని నిరూపించుకోవాలంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పాత్రధారులతో పాటు సూత్రధారులను బయటపెట్టాలన్నారు. కవిత లిక్కర్ స్కామ్​లో అరెస్ట్ అయ్యారని, ఫోన్ ట్యాపింగ్​తో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో కూడా కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.