
- మోడీ, అమిత్ షా, నడ్డాను పిలిచే యోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం
- దక్షిణ తెలంగాణలో మోడీ సభ!
- త్వరలో హైకమాండ్ నుంచి క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నది. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ లేదా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకర్గంలో, దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని ఒక పార్లమెంట్ స్థానంలో, కర్నాటక సరిహద్దులో ఉన్న జహీరాబాద్ లేదా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో సభలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ రాష్ట్ర క్యాడర్‌లో జోష్ నింపేందుకు ఈ సభలను పార్టీ నిర్వహించనుంది. వీటికి చీఫ్ గెస్టులుగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెలలోనే ఈ మూడు బహిరంగ సభలు నిర్వహించేందుకు యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. త్వరలో దీనిపై పార్టీ హైకమాండ్‌ను అనుమతి కోరనుంది. ఆ తర్వాతే ఢిల్లీ నుంచి అగ్ర నేతల రాష్ట్ర టూర్లపై స్పష్టత రానుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే ఓ నేత చెప్పారు.
దక్షిణ తెలంగాణలో మోడీ సభ..!
ఆదిలాబాద్ లేదా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటరీ ప్రవాసీ యోజనలో భాగంగా గతంలో అమిత్ షా టూర్ ఖరారై, లాస్ట్ మినిట్‌లో రద్దయింది. ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా బొగ్గు గని కార్మికులు, ఆదివాసీలు ఉంటారు. ఇక్కడ అమిత్ షా వంటి అగ్ర నేతను తీసుకొస్తే పార్టీలో కొంత జోష్ వస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఉత్తర తెలంగాణతో పోల్చితే దక్షిణ తెలంగాణలో బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నికతో దక్షిణ తెలంగాణలో బీజేపీ కొంత బలపడినా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గట్టి పోటీ ఇవ్వాలంటే బలమైన నాయకత్వం పార్టీకి అవసరమని భావిస్తున్నది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని ఏదేని ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించే సభకు ప్రధాని మోడీని ఆహ్వానిస్తే బాగుంటుందని రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. కర్నాటక సరిహద్దుల్లో ఉన్న చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండూర్ లేదా పరిగి ప్రాంతంలో.. అక్కడ వీలు కాకపోతే జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో పార్టీ చీఫ్ నడ్డాతో సభను నిర్వహించే ఆలోచనలో ఉంది.
ఐదు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..
కాగా, ఈ ఏడాది చివరిలో తెలంగాణతో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ జాతీయ నాయకత్వం వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘‘మహాజన్ సంపర్క్ అభియాన్”ప్రోగ్రాం కొనసాగుతుండడంతో తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే నెలలో విస్తృతంగా పర్యటించాలని మోడీ, అమిత్ షా, నడ్డా నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ముగ్గురు అగ్ర నేతలు ఒకే నెలలో తెలంగాణలో పర్యటించాలనే రాష్ట్ర బీజేపీ నేతల ప్రతిపాదనలను ఎంత వరకు ఆమోదిస్తారో చూడాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.