రాముడి పేరుతో బీజేపీ రాజకీయం : చాడ వెంకటరెడ్డి

రాముడి పేరుతో బీజేపీ రాజకీయం : చాడ వెంకటరెడ్డి
  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ
  • హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

హుస్నాబాద్, వెలుగు: దేశంలో రాముడి పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాముడి పేరుతో రాజకీయం చేస్తే కమ్యూనిస్టు పార్టీలు చూస్తూ ఊరుకోవన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ మతరాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ మాట్లాడారు. బిల్కిస్ బానో అత్యాచారం, కుటుంబీకుల హత్య కేసులో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని, ఈ పరిణామం బీజేపీకి చెంపపెట్టు లాంటిదన్నారు. ‘బీజేపీ హఠావో, దేశ్​ బచావో’ నినాదంతో తాము ఇండియా కూటమిలో చేరామన్నారు. దేశంలో ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాలరాస్తున్నాయో తెలుపుతూ ‘ప్రభుత్వ బందీగా ప్రజాస్వామ్యం’ పేరుతో తాను పుస్తకం రాశానని తెలిపారు.

తెలంగాణలోనూ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కొట్లాడామని చెప్పారు. విరసం, అరసం, ఇతర ప్రజా సంఘాలతో కలిసి పోరాడామని, కాంగ్రెస్​ను గెలిపించి ప్రజాపాలన తెచ్చామన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలపాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలతో పాటు ఇతర హామీలను కూడా నెరవేర్చాలని కాంగ్రెస్  ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్​తో కలిసి పోటీ చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు.