ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నెట్​వర్క్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ లీడర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడిని నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లావ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్​ దాడులు చేస్తోందని బీజేపీ లీడర్లు ఆరోపించారు. టీఆర్ఎస్​ దాడిపై సీఎం కేసీఆర్​క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. నిర్మల్​లో కలెక్టరేట్ ముందు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్​దిష్టిబొమ్మలు దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మె రాజు, పార్టీ లోక్ సభ ఇన్​చార్జి అయ్యన్నగారి భూమయ్య పాల్గొన్నారు. ఆదిలాబాద్​లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భైంసా, నస్పూర్, రామకృష్ణాపూర్, క్యాతనపల్లి, చెన్నూర్,  బజార హత్నూర్ మండలకేంద్రాల్లో బీజేపీ లీడర్లు సీఎం కేసీఆర్​దిష్టిబొమ్మ దహనం చేశారు. 

అక్రమంగా తరలిస్తున్న 20 టేకు బల్లలు పట్టివేత 

దహెగాం, వెలుగు: దహెగాం మండలం ఖర్జి ఫారెస్ట్​ ఏరియాలో బొలెరోలో తరలిస్తున్న 20 టేకు బల్లలను పట్టుకున్నట్టు డీఆర్వో శ్రీధరాచారి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి... ఫారెస్ట్​ ఆఫీసర్లకు అందిన సమాచారంమేరకు డీఎఫ్​వో దినేశ్​కుమార్ సిబ్బందితో కలసి మంగళవారం రాత్రి మాటువేసి బొలెరో వాహనాన్ని చెక్​చేయగా అందులో 20 టేకు బల్లలు లభించాయన్నారు. బల్లలతోపాటు వాటిని తరలిస్తున్న ఎల్లూర్​ గ్రామానికి చెందిన బిట్టుపల్లి చంద్రశేఖర్​, ఎల్కపెల్లి గ్రామానికి చెందిన ఒండ్రె బాబాజీ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిని విచారించగా మంచిర్యాల జిల్లా వేమన్​పల్లి మండలంలోని ఖల్లెంపల్లి నుంచి పెంచికల్​పేట్​ కు తరలిస్తున్నామని చెప్పారన్నారు. కాగా ఈ వాహనం పెంచికల్​పేట్​జడ్పీటీసీగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారులు వెల్లడించలేదు.  

మన ఊరు- మన బడి పనులను స్పీడప్ ​చేయాలి

లోకేశ్వరం, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మనబడి’ లో భాగంగా స్కూళ్లలో పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్​ ముషారఫ్​అలీ ఫారూకీ అన్నారు.  బుధవారం మండలంలోని రాజుర, గడ్​చంద గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లను కలెక్టర్​తనిఖీ చేశారు. క్లాస్​రూంలను పరిశీలించారు. అనంతరం గడ్​చందా ప్రైమరీ స్కూల్​ను తనిఖీ చేశారు. విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా టీచర్లు కృషి చేయాలన్నారు. కలెక్టర్​వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఆసిఫాబాద్ ,వెలుగు : ఈనెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్, జిల్లా ప్రధాన జడ్జి రవీంద్రశర్మ సూచించారు. బుధవారం  జాతీయ లోక్ అదాలత్ పై  పోలీస్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ లో  కేసులు త్వరగా పరిష్కారం చేసుకునేలా చూడాలన్నారు. మీటింగ్ లో  సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమామహేశ్వరి , అడిషనల్ జూనియర్ సివిల్  జడ్జి శారీన పాల్గొన్నారు.

సింగరేణి  కీర్తి దేశవ్యాప్తం చేయాలి 

ఆసిఫాబాద్, వెలుగు: సింగరేణి  కీర్తి దేశవ్యాప్తం కావాలని బెల్లంపల్లి ఏరియా జీఎం దేవేందర్ అన్నారు. బుధవారం రెబ్బెన మండలం గోలేటి స్టేడియంలో  వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ క్రీడల్లో భాగంగా కంపెనీ స్థాయి ఫుట్ బాల్ పోటీలను జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఫుట్ బాల్ ప్రపంచంలోనే గొప్ప ఆట అని, క్రీడాకారులు నిత్య సాధన ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమం లో టీబీజీకేఎస్  ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్, స్పోర్ట్స్ సూపర్​వైజర్(కార్పొరేట్) సుందర్ రాజు , ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వరప్రసాద్ , పర్సనల్ మేనేజర్  ఐ.లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.

వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్​ పెట్టాలి  

కాగ జ్ నగర్,వెలుగు: ఆశ్రమ స్కూళ్లలో చదివే విద్యార్థులు బెస్ట్​రిజల్ట్స్ సాధించేందుకు ప్రతీ టీచర్​కృషి చేయాలని, విద్యార్థులలో అభ్యాస సామర్థ్యాలను పెంచేలా విద్యా బోధన చేయాలని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ కె.వరుణ్ రెడ్డి సూచించారు.  బుధవారం కాగజ్ నగర్ లోని బాలుర ఆశ్రమ స్కూల్​ను ఆయన తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో రికార్డులు, వంటగదిలో శుభ్రత, బియ్యం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలని వార్డెన్, సిబ్బందిని ఆదేశించారు. చదువులో వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీవో హుస్సేన్, హెచ్​ఎం, టీచర్లు పాల్గొన్నారు.

సొంత పనులకు ఎంప్లాయీస్​ను వాడుకుంటున్రు..

మందమర్రి, వెలుగు: సింగరేణిలోని కొందరు ఆఫీసర్లు కిందిస్థాయి ఎంప్లాయీస్​ను సొంత పనులు చేయాలని వేధిస్తున్నారని హెచ్ఎంఎస్​ వైస్​ ప్రెసిడెంట్​పార్వతి రాజిరెడ్డి అన్నారు. బుధవారం మందమర్రిలోని సీఈఆర్​ క్లబ్​ వెనుక వైపున్న క్వార్టర్​ 14బీలో  ఉండే సింగరేణి సర్వేయర్​ తన ఇంట్లో ముగ్గురు సింగరేణి ఎంప్లాయిస్​తో సొంత పనులు చేయించుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఆఫీసర్లు ఎంప్లాయిస్​ను సొంత పనుల కోసం వాడుకుంటున్న ఆఫీసర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

మున్సిపాలిటీలో అవినీతిపై విచారణ జరపాలి

ఖానాపూర్, వెలుగు:  ఖానాపూర్   మున్సిపాలిటీలో  పెద్దఎత్తున  అవినీతి జరుగుతోందని దీనిపై విచారణ జరిపి చర్యలు  తీసుకోవాలని  కాంగ్రెస్  ఫ్లోర్ లీడర్ రాజుర సత్యం డిమాండ్  చేశారు.  బుధవారం ఆయన  మీడియాతో  మాట్లాడుతూ తైబజార్ పేరిట చిరు వ్యాపారుల  నుంచి  పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని  ఆరోపించారు. మున్సిపాలిటీ లో  శానిటేషన్​కార్మికులకు వేతనాలు చెల్లింపుతోపాటు వారి హాజరు విషయంలో అవకతవకలు  జరుగుతున్నాయన్నారు. అక్రమ లేఅవుట్లు, అపార్ట్​మెంట్​పర్మిషన్ల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో యువజన కాంగ్రెస్  నియోజకవర్గ అధ్యక్షుడు, కౌన్సిలర్ గుగ్ల వాత్ కిషోర్ నాయక్, 12వ వార్డు  కౌన్సిలర్ షబ్బీర్ పాషా పాల్గొన్నారు 

పట్టుదలతో చదివి కొలువు సాధించాలి 

నస్పూర్, వెలుగు: ప్రతి అభ్యర్థి పట్టుదలతో చదివి పోలీస్​కొలువు సాధించాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవ రెడ్డి తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఎస్సై,  కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  సింగరేణి పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఫిజికల్ ట్రైనింగ్,  రాత పరీక్షలకు శిక్షణ శిబిరాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.   సురేందర్ రెడ్డి , ఎస్వోటు జీఎం త్యాగరాజు,  గోవిందరాజు, శ్రీరాంపూర్ సీఐ  రాజు,  ఎస్సై మానస, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీ మోహన్, సీనియర్​పీవో కాంతారావు పాల్గొన్నారు.

4 నుంచి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ఖానాపూర్ వెలుగు: ఖానాపూర్​ పట్టణంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి ఈ నెల 9 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు  ఆలయ కమిటీ అధ్యక్షుడు అడ్డగట్ల రాజన్న తెలిపారు. ఉత్సవాలకు ఆలయాన్ని అంగరంగవైభవంగా ముస్తాబు చేశారు. ఈ ఉత్సవాలకు ఖానాపూర్ , కడెం మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.