
జయశంకర్ భూపాలపల్లి/ కాటారం/ మల్హర్ , వెలుగు: రాష్ట్రాన్ని మేఘా కంపెనీ పేరుతో కేసీఆర్ దోచుకుంటున్నారని, కేంద్రం ఇచ్చిన పైసలతో రాష్ట్రంలో పథకాలు అమలుచేస్తూ టీఆర్ ఎస్ నేతలు తామే చేసినట్టు చెప్పుకుంటున్నారని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా మల్హర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తగా పెండ్లయిన మహదేవపూర్ బీజేపీ మండల లీడర్ రాజేందర్, మాధవి దంపతులను విష్ చేసి.. ఆశీర్వదించారు. కాటారం మండల కేంద్రంలో బీజేపీ జెండా ఎగురవేశారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసును ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు. కార్యకర్తలంతా కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త కంకణ బద్ధులై పనిచేయాలని, కమలం గుర్తును గ్రౌండ్ లెవల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో చెరగని ముద్రవేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ స్కీం కింద హాస్పిటల్ ఖర్చు రూ. 10 లక్షలు పెంచుకునే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో ఉండేలా ప్రయత్నిద్దామన్నారు. అనంతరం అన్నారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివేక్ మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా పూర్తికాని చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే పూర్తిచేసి నియోజక వర్గ ప్రజలకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కాటారం సబ్ డివిజన్ లోని సుమారు 200 మంది యువకులు వివేక్ సమక్షంలో బీజేపీ లో చేరారు. ఇందులో మల్హర్ మండలం నాచారం గ్రామానికి చెందిన 50 మంది , కాటారం మండలానికి చెందిన 50 మంది , మహదేవపూర్ మండలం అన్నారాని చెందిన 100 మంది ఉన్నారు. కార్యక్రమాల్లో బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కన్నం యుగదీశ్వర్, మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి, లీడర్లు బొమ్మన భాస్కర్ రెడ్డి, కోయిల్కర్ నిరంజన్ , సిరిపురం శ్రీమాన్ , ఆకుల శ్రీధర్ , దుర్గం తిరుపతి, ఉడుముల విజయ రెడ్డి, పాగే రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.