ఈటల గెలవాలని హుజురాబాద్ ప్రజలు కోరుకుంటున్నరు

ఈటల గెలవాలని హుజురాబాద్ ప్రజలు కోరుకుంటున్నరు

హనుమకొండ: ఈ నెల 30న హుజూరాబాద్‌ బై ఎలక్షన్‌లో ప్రజలు తమ మనసులో ఉన్న పువ్వు గుర్తుకే ఓటేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యుడు వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వం.. మద్యం, బిర్యానీలు పంచుతూ ఈటలను ఓడించాలని చూస్తోందని, జనాలకు మాయమాటలు చెబుతోందని అన్నారు. అయితే ప్రజల మనసును గెలిచిన ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారని చెప్పారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రభుత్వమని, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారని, ఆ సమయంలో హామీలు గుప్పించి తర్వాత మర్చిపోవడం సీఎం కేసీఆర్‌‌కు పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. ‘‘హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌‌ను అణచివేయాలనే అనేక స్కీంలు ప్రకటించారు. ఎన్నికల తర్వాత కూడా ఇక్కడే ఉండి అభివృద్ధి చేస్తామని మాటలు చెబుతున్నారు. నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమిచ్చారు? ఏమి పూర్తి చేసారో చెప్పాలి. మాయమాటలు చెప్పి.. ఎన్నికల తర్వాత మర్చిపోవడం టీఆర్‌‌ఎస్‌కు అలవాటుగా మారిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ.. వరదలకు నష్టపోయిన వారికి పదివేలు ఇస్తామని చెప్పి, ఎన్నికల తర్వాత పైసా కూడా ఇవ్వలేదు. హుజురాబాద్‌లో కూడా ఇలాంటి వాగ్దానాలే చేస్తున్నారు. ఇవన్నీ నెరవేరవని ప్రజలకు అర్థమైంది. అందుకే ఈటలనే గెలిపించుకోవాలని వాళ్లు మనసులో నిశ్చయించుకున్నారు” అని వివేక్‌ అన్నారు.

టీఆర్‌‌ఎస్ నేతలవి అబద్ధపు ప్రచారాలు..

టీఆర్ఎస్ నాయకులందరూ ఈటల ఏమీ అభివృద్ధి చేయలేదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ‘‘ఎమ్మెల్యే సుమన్, మంత్రి ఈశ్వర్, మరో ఎమ్మెల్యే ధర్మారెడ్డి లాంటి వాళ్లు తమ నియోజకవర్గాల్లో ఏమీ చేయకపోయినా.. ఈటలపై విమర్శలు చేస్తున్నారు. వాళ్ల నియోజకవర్గాల్లో వాళ్లు ఏం చేశారో చెప్పాలి” అని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  కేంద్రం ఏం చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆరు నెలల పాటు 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎక్కడా ఇవ్వలేదని, మోడీ సర్కారు మాత్రమే బీద ప్రజలను ఆదుకునేందుకు 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఉజ్వల్ స్కీంలో ఉన్నవారికి ఉచిత గ్యాస్ ఇచ్చారని, ఉపాధి హామీ పథకం కింద కూలీ రేటును 180 నుంచి 237 రూపాయలకు పెంచారని తెలిపారు. ఎక్కువ పనులు కల్పించి.. కరోనా కష్టకాలంలో కేంద్రం ఉపాధి చూపించిందన్నారు. ఈ రోజు వరకు 95 కోట్ల మందికి ఫ్రీ వాక్సిన్ మోడీ సర్కారు ఇచ్చిందని, ప్రపంచంలో అందరూ 95 కోట్ల మందికి ఇంత త్వరగా ఎలా వ్యాక్సిన్ ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆయుష్మాన్ భారత్ లో చేర్చారని, దీని వల్ల ఎంతో మేలు జరిగిందని చెప్పారు.

ఉపాధి, ఉద్యోగాలు కల్పించకుండా.. 

రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం.. ఆ పని చేయడం లేదని, మద్యం, బిర్యానీలు పంచుతూ కీడు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. ప్రజాస్వామిక రాష్ట్రం కావాలని అందరం కలిసి తెలంగాణ కోసం కొట్లాడామని, కానీ ఈ సర్కారు రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చడం బాధకలిగిస్తోందని అన్నారు. ధనిక రాష్ట్రమని చెబుతున్నారు.. కానీ 4 లక్షల అప్పులు చేసి ప్రజలపై భారం వేస్తున్నారని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకున్నారని ఈటల చెబుతున్న మాటలు నిజమన్నారు. అవినీతి ప్రభుత్వం.. ఈటలను ఎలాగైనా ఓడించాలని మాయమాటలు చెబుతున్నారని, అయితే ప్రజల మనసును గెలిచిన ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వివేక్ చెప్పారు. ‘‘మేమందరం బీజేపీ తరపున ఏది ధర్మం, ఏది అధర్మమని ప్రచారం చేస్తున్నాం. ఈటల గెలవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు” అని ఆయన అన్నారు. కాగా, ఈ ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, సంకినేని వెంకటేశ్వర్ రావు, నేతలు మురళీధర్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.