
- ఇండియా ఇద్దరు వ్యాపారుల సొత్తు కాదు.. పేదల సొంతం
- ప్రతిపక్ష నేతలను పార్లమెంటులో మాట్లాడనిస్తలే
- ప్రజలను కలిసేందుకే భారత్ జోడో యాత్ర
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లీడర్లు దేశాన్ని విభజిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా భయాన్ని వ్యాప్తి చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ద్వేషాన్ని స్ప్రెడ్ చేస్తూ దేశాన్ని బలహీనపరుస్తున్నారని, ఇది చైనా, పాకిస్తాన్ వంటి ఇండియా శత్రువులకు లాభం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భయాన్ని, ద్వేషాన్ని తొలగించినప్పుడే ఇండియా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. దేశంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ ‘మెహంగయ్ పర్ హల్లా బోల్ ర్యాలీ’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ 27 కోట్ల మంది ప్రజలను దారిద్ర్యం నుంచి బయటపడేసిందని, కానీ 8 ఏండ్లలో 23 కోట్ల మందిని పేదరికంలోకి ప్రధాని మోడీ పడేశారని ఆరోపించారు. తాము పదేండ్లలో చేసిన పనులను వాళ్లు 8 ఏండ్లలో నాశనం చేశారని మండిపడ్డారు.
ఈడీ ముందు ఐదేండ్లు కూర్చోబెట్టినా భయపడ..
‘‘55 గంటలు నన్ను ఈడీ ముందు కూర్చోబెట్టారు. నేను మోడీకి ఒక్కటే చెప్పానుకుంటున్నా.. 55 గంటలు కాదు.. 100 గంటలు, 500 గంటలు, 5 ఏండ్లు కూర్చోబెట్టినా నాకేం కాదు. నేను భయపడబోను” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం దేశం రెండుగా విడిపోయింది. ఒకటి నిరుద్యోగులు, కార్మికులు, రైతులది. ఇందులో ఎవరూ భవిష్యత్ గురించి కలలు కనలేరు. రక్తం, చెమట చిందించినా.. ఏమీ పొందలేరు. మరొకటి కొద్దిమంది వ్యాపారవేత్తలతో కూడినది. ఇందులో వారు 24 గంటలూ అన్ని రకాల కలలూ కనొచ్చు” అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ రెండింటి మధ్య ప్రస్తుతం లడాయి జరుగుతున్నదన్నారు. ‘‘దేశాన్ని అమ్మాలి.. ఇద్దరికి మాత్రమే కట్టబెట్టాలనేది మోడీ ఆలోచన. కానీ దేశ ఫలితాలు అన్నివర్గాల వారికీ దక్కాలన్నదే కాంగ్రెస్ ఆలోచన. యూపీఏ సర్కార్‌కు.. బీజేపీ సర్కార్‌కు మధ్య తేడా ఏమిటో చిరు వ్యాపారులు, రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారిని అడిగితే చెబుతారు” అని చెప్పారు. రైతుల కోసం యూపీఏ సర్కార్ రూ.70 వేల కోట్లు ఇస్తే.. మోడీ సర్కార్ మూడు నల్ల చట్టాలను ఇచ్చిందని ఆరోపించారు.
ప్రజలకు నిజాలు చెప్తం
70 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ ఏంచేసిందని మోడీ ప్రశ్నిస్తున్నారని, ఇంత ఖరీదైన భారత్‌ను ఎప్పుడూ సృష్టించలేదని రాహుల్ అన్నారు. రైతు సమస్యలు, చైనా ఆక్రమణలు, నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై ప్రతిపక్ష నేతలను పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ఇద్దరు వ్యాపారవేత్తల చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయని, ఆ మీడియా సంస్థలు మోడీ కోసం.. మోడీ ఆ వ్యాపార వేత్తల కోసం 24 గంటలు పని చేస్తారని విమర్శించారు. ఒకవైపు మీడియా, మరోవైపు ప్రధానిని వాళ్లిద్దరు కంట్రోల్ చేస్తున్నారన్నారు. దేశం ఇద్దరు వ్యాపారుల సొత్తు కాదని, పేదల ప్రజల సొంతమన్నారు. ప్రజలను చేరుకునేందుకు వేరే మార్గం లేక భారత్ జోడో యాత్రను తాము చేపడుతున్నామని, ప్రజల మధ్యకు వెళ్లి నిజాలు చెబుతామని తెలిపారు.
నిరుద్యోగం, ధరలు మరింత పెరుగుతయ్
‘‘నోట్ల రద్దుతో పేదలకు మేలు జరిగిందా? రైతులకు రుణమాఫీ చేశారా? రైతుల కోసమే అగ్రి చట్టాలు తెస్తే.. దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి ఎందుకు వచ్చారు? రైతుల శక్తి అర్థమై ఆ చట్టాలను మోడీ వెనక్కి తీసుకున్నారు” అని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వేరొక జీఎస్టీ తీసుకురావాలని యోచించిందని, కానీ బీజేపీ ఐదు రకాల ట్యాక్స్‌లతో మరో జీఎస్టీ తెచ్చిందని, రైతులు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల వెన్నువిరిచిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరుగుతాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ ధర రూ.410 ఉంటే, ప్రస్తుతం రూ.1,050కి పెరిగిందని, పెట్రోల్, డీజీల్ ధరలు రూ.వంద దాటాయని, పాలు, పిండి, ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు.
కుటుంబాన్ని కాపాడుకునే ర్యాలీ: బీజేపీ విమర్శ
కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం.. రాహుల్ గాంధీ రీలాంచ్ 4.0 అని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేందుకు ఆ పార్టీలో ఎవరూ ఇష్టపడటం లేదని ఎద్దేవా చేసింది. ‘‘కాంగ్రెస్ చేపట్టిన నిరసన ముఖ్య ఉద్దేశం.. గాంధీ ఫ్యామిలీని కాపాడుకోవడం, రాహుల్ గాంధీని రీలాంచ్ చేయడం. అంతేతప్ప ధరల పెరుగుదల కు వ్యతిరేకంగా కాదు” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శించారు. 2014 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ 90% ఎన్నికల్లో ఓడిపోయిందని, గత యూపీ ఎన్నికల్లో ఏకంగా 90% సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని చెప్పారు.