మమత భయపడుతున్నారు: బీజేపీ ఆరోపణ

మమత భయపడుతున్నారు: బీజేపీ ఆరోపణ
  • అందుకే ప్రెస్‌మీట్లకు రావడం లేదు
  • సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య వార్‌‌ రోజు రోజుకి ముదురుతోంది. మమతా బెనర్జీ చేస్తున్న తప్పులను కేంద్రం బయటపెట్టినందు వల్లే భయపడి ఆమె మీడియా ముందుకు రావడంలేదని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో దీదీకి వ్యతిరేకంగా క్యాంపైన్‌ స్టార్ట్‌ చేసింది. #BhoyPeyechheMamata (ఫెయిల్‌యూర్స్‌ వల్ల మీడియా ముందుక రావడం లేదు) అనే హ్యాష్‌ట్యాగ్‌ను బీజేపీ సోషల్‌ మీడియా టీమ్‌ వైరల్‌ చేస్తోంది. బీజేపీకి చెందిన చాలా మంది సీనియర్‌‌ నేతలు కూడా దీన్ని పోస్ట్‌ చేశారు. 2014 నుంచి ప్రధాని మోడీ ఎలాంటి ప్రెస్‌మీట్లలో పాల్గొనలేదు అని తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శించిన నేపథ్యంలో బీజేపీ ఎదురుదాడికి దిగింది. మార్చిలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మమతా బెనర్జీ ఏప్రిల్‌ 30 తర్వాత నుంచి ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రంలోని పరిస్థితికి సంబంధించి చీఫ్‌ సెక్రటరీ, హోమ్‌ సెక్రటరీ మాత్రమే మీడియా ముందుకు వచ్చి ప్రకటలను చేస్తున్నారు. “ డాక్టర్లే పీపీఈ కిట్లు కొనుక్కుంటారు. పేషంట్లు డెడ్‌ బాడీల పక్కనే ఉంటారు. వలస కూలీలను ప్రభుత్వం అనుమతించదు. బెంగాలీలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఒప్పుకోరు. పోలీసులు అధికారులపై దాడులు చేస్తారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే” అని బీజేపీ జనరల్‌ సెక్రటరీ కైలాశ్‌ విజయ్‌వర్గియా ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో ఇంతలా కేసులు పెరుగుతుంటే మమత ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అంటూ బీజేపీ నేత ముకుల్‌ రాయల్‌ తదితరులు ట్వీట్‌ చేశారు. కాగా.. బీజేపీ చేస్తున్న ఆరోపణలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖండిచింది. 2021లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కావాలనే రాజకీయం చేస్తోందని తృణమూల్‌ లీడర్లు అన్నారు. ఈ పరిస్థితిని క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.