కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా

కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా

ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపిండు: బండి సంజయ్
మళ్లీ అధికారమిస్తే ఇంకో రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తడు
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలె
జీవో 317తో టీచర్లకు ఇబ్బందులు..వారి సమస్యలు పరిష్కరించాలి
లేకుంటే 30న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తమని హెచ్చరిక
అంబేద్కర్​ పేరు పెట్టి కేసీఆర్​ బర్త్​డే రోజు సెక్రటేరియెట్​ ఓపెనింగా..?

మహబూబ్ నగర్, వెలుగు :కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఇప్పటికే ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపారని, మళ్లీ అధికారమిస్తే ఇంకో ఐదు లక్షల కోట్ల అప్పు చేస్తారని మండిపడ్డారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ మీటింగ్‌‌‌‌లో సంజయ్ మాట్లాడుతూ.. ‘‘సీఎం కేసీఆర్‌‌‌‌కు చిత్తశుద్ధి ఉంటే 2014కు ముందు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తులెన్ని? అనే వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే వైట్ పేపర్ విడుదల చేయాలె. 2014 నాటికి, ఇప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెచ్చిన అప్పులు, వాటిని ఎలా ఖర్చు పెట్టారనే అంశాలపైనా శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

సెక్రటేరియెట్‌‌కు అంబేద్కర్ పేరు పెట్టి.. కేసీఆర్ పుట్టిన రోజున ఓపెనింగా?

కొత్తగా నిర్మించిన సెక్రటేరియెట్‌‌కు అంబేడ్కర్ పేరు పెట్టారని, కానీ అంబేద్కర్ పుట్టిన రోజున కాకుండా, కేసీఆర్ పుట్టిన రోజున ఎందుకు ఓపెన్ చేస్తున్నారో సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రంలో లిక్కర్ ద్వారా ఏడాదికి రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోంది. లిక్కర్​పై ఒక్కో కుటుంబం నుంచి రాష్ర్ట ప్రభుత్వానికి రూ.50 వేల ఆదాయం వస్తోంది. కానీ ప్రభుత్వం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల అప్పు మిగిలింది’’ అని చెప్పారు. 22 నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం 25 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోనే 2.46 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి అపాయింట్‌‌మెంట్ లెటర్లను ఇచ్చిందని గుర్తు చేశారు.

ప్రజలను దారి మళ్లించేందుకే బీఆర్ఎస్

తెలంగాణ ప్రజలను దారి మళ్లించేందుకు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని, కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎందుకు దివాలా తీయించారో సమాధానం చెప్పిన తర్వాత మిగతా అంశాలపై మాట్లాడాలని సవాల్ విసిరారు. జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్.. దేశానికి ఏం చేయబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో 317తో టీచర్లు ఇంకా ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. 30వ తేదీ లోపు ఆ సమస్యను పరిష్కరించి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే 30న ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, తమిళనాడు సహ ఇన్‌‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి హాజరయ్యారు.

రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తుండు

రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్ నీరుగారుస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర గవర్నర్‌‌‌‌ను అవమానిస్తున్నారని, అసెంబ్లీకి ఆహ్వానించడం లేదని మండిపడ్డారు. అధికార వ్యవస్థను చెప్పుచేతుల్లో పెట్టుకొని తెలంగాణ ప్రజలతో ఆటలాడుతున్నారని ఫైరయ్యారు. చివరకు కోర్టు తీర్పులను కూడా ధిక్కరిస్తున్నారని విమర్శించారు. జాతీయత, జాతీయ భావం లేని పార్టీ బీఆర్ఎస్ అని, దేశభక్తితో జాతీయ భావంతో పనిచేసే పార్టీ బీజేపీ అని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే పార్టీ బీజేపీనేనని అన్నారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఏనాడూ దేశం కోసం ఆలోచించలేదు. ప్రజలను, దేశాన్ని ఏ విధంగా దోచుకుందామా? ఎలా మోసం చేద్దామా? అని కుట్రలు చేసే పార్టీలు” అని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అధికారాన్ని కాపాడుకునేందుకు ఎంతటి నీచానికైనా పాల్పడతారని మండిపడ్డారు. కుటుంబాలను, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వెనుకాడరని, వీడియోలు, ఫొటోల పేరుతో దుష్ర్పచారం చేస్తూ బీజేపీ మైలేజీని తగ్గించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఉచిత విద్య, వైద్యం అందిస్తం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. పేదలకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా కింద పరిహారం చెల్లిస్తామని, ఈ హామీలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రజలకు నమ్మకం కలిగించాలని కేడర్‌‌‌‌కు సూ చించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రజాకార్, రాక్షస రాజ్యానికి చరమగీతం పాడి బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.