కేసీఆర్​నే దేఖరు.. ఆయన బిడ్డను ఎవరు పట్టించుకుంటరు?: బండి సంజయ్​

కేసీఆర్​నే దేఖరు.. ఆయన బిడ్డను ఎవరు పట్టించుకుంటరు?: బండి సంజయ్​
  •     టీఆర్ఎస్​లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు పోయే దమ్ముందా?

  •     ముందస్తుకు పోతలేమని కేసీఆర్​ అంటే.. పోతున్నట్లే

  •     రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం రెడీ.. ఒంటరిగానే పోటీ

  •     నియోజకవర్గానికి లక్ష ఓట్ల సాధనే లక్ష్యం

  •     28 నుంచి ఐదో విడత పాదయాత్ర 

  •     చిట్ చాట్​లో బీజేపీ స్టేట్​ చీఫ్ 

హైదరాబాద్, వెలుగు: బిడ్డను అడ్డంపెట్టుకొని సీఎం కేసీఆర్  నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్​ మండిపడ్డారు. ‘‘అధికారం కోసం  కుటుంబ సభ్యులను కూడా వాడుకునే నీచుడు కేసీఆర్.. చివరికి బిడ్డను బీజేపీ లాగాలని చూస్తున్నదని సిగ్గులేకుండా చెప్తున్నడు. అయినా.. కేసీఆర్​నే ఎవరూ దేఖడం లేదు.. ఇక ఆయన బిడ్డను పట్టించుకునేదెవరు?’’ అంటూ ప్రశ్నించారు. బీజేపీలోకి రావాలని అడిగే వాళ్లను చెప్పుతో కొట్టాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.  ‘‘ఇతర పార్టీల నుంచి గెలిచిన 37 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా, సిగ్గు లేకుండా టీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ ను... మరి ఏ చెప్పుతో కొట్టాలి? బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు బేషరతుగా తమ పదవులకు రాజీనామా చేసి రావాలి...  అదే మా సిద్ధాంతం.. మరి కేసీఆర్​ సంగతేంది? ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్మూ, ధైర్యం కేసీఆర్ కు ఉందా?” అని సవాల్​ చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. 

కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్​లో టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడకుండా.. ఎన్ని నీచ రాజకీయాలైనా చేసి గెలవాలని చెప్పారని విమర్శించారు. ‘‘ఇతర పార్టీల నేతలను గుంజాలె.. ఇతర పార్టీలపై బురద చల్లాలె.. ఇదే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తున్నది” అని దుయ్యబట్టారు. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులోని నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు రావడం లేదో, వారిని కేసీఆర్ గంప కింద ఎందుకు కమ్మి పెట్టారో అర్థం కావడం లేదన్నారు. ఈ కేసులో సీఎం కేసీఆర్​కు దమ్ముంటే డెక్కన్ కిచెన్ హోటల్, ఫామ్​హౌస్​, ప్రగతి భవన్ లోని సీసీ పుటేజీలను బయటపెట్టాలని, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.  

కేసీఆర్​ ముందస్తుకు పోతడు

ముందస్తు ఎన్నికలు ఉండవని కేసీఆర్ అంటున్నారని, కాని ఆయన ఏది చెప్పినా... అది ఉల్టా జరుగుతుందని, అంటే కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ పోతారనే విషయం స్పష్టమవుతున్నదని సంజయ్​ పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయం కేసీఆర్​లో ఉంది.. ఫోన్ ట్యాప్​ చేస్తున్నదే కేసీఆర్.. ఎమ్మెల్యేలందరి ఫోన్లు ట్యాప్ చేస్తుంది ఆయనే.. ఇందుకోసం ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడుతున్నడు” అని ఆరోపించారు. మోడీని కలవాలంటే కేసీఆర్ ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు.  ‘తెలంగాణలోనే కేసీఆర్​కు దిక్కు దివాణా లేదు.. మునుగోడులోనే 100 మంది ఎమ్మెల్యేలను మోహరించిండు..  టీఆర్ఎస్​కు బూత్ కమిటీల్లేవు.. మండల, జిల్లా కమిటీల్లేవు.. దేశం మొత్తం ఎట్లా పోటీ చేస్తడు” అని ఎద్దేవా చేశారు. ‘‘బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్​లో చేరబోతున్నారనేది ఒట్టి ప్రచారం... ఇదంతా కేసీఆర్ డ్రామా... ప్రజలను డైవర్ట్​ చేయడానికి ఈ డ్రామాలు ఆడుతున్నడు” అని మండిపడ్డారు. 

ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిచ్చిండు

‘‘నల్గొండ జిల్లా కమ్యూనిస్టుల అడ్డా అని చెప్పుకుంటారు కదా... ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా కేసీఆర్ తన గంప కింద కమ్మేస్తే.. నిలదీయాల్సింది పోయి సిగ్గు లేకుండా ఆయన సంకలో చేరారు” అని సీపీఐ, సీపీఎం నేతలపై సంజయ్​ మండిపడ్డారు. ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ దేనని,  వందల కోట్లు ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని  తీసుకొచ్చారని, అందుకు మునుగోడే నిదర్శనమన్నారు. ‘‘చివరికి బ్యూరోక్రసీని కూడా దిగజార్చిండు.. సీట్ల కోసం, పోస్టింగుల కోసం బ్యూరోక్రసీ సీఎం కాళ్లు మొక్కుతున్నరు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు  కేసీఆర్​ కాళ్లను పదేపదే మొక్కడం దేనికి సంకేతం?” అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీకి మద్దతివ్వాలని, కోవర్టు రాజకీయాలు చేసే నాయకులు ఏ పార్టీలో ఉన్నా గల్లా పట్టి గుంజి బజారున నిలబెట్టాలని అన్నారు.  

మర్రి శశిధర్​రెడ్డి చేరిక విషయం తెలియదు

మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరిక విషయం తనకు తెలియదని, వాళ్లు సొంత పనిమీద పోతే.. దానికి పార్టీకి లింక్ పెడుతూ ప్రచారం చేస్తున్నారని సంజయ్​ అన్నారు. ‘‘ఎవరో రావాలి.. ఎవరినో చేర్చుకోవాలని మేం అనుకోవడం లేదు.. కార్యకర్తలే మా బలం” అని పేర్కొన్నారు. ఇంట్లో కూర్చున్న స్వామిగౌడ్ లాంటి వాళ్లకు గౌరవ స్థానం కల్పించిందని,  ఆ సంస్కారం తమ పార్టీకి ఉందని, వాళ్లు ఏం ఆశించి వెళ్లారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ‘‘నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేత  రామారావు పటేల్ మంచి నాయకుడు.. హిందుత్వ వాది.. భైంసా అల్లర్లలో బాధితుల పక్షాన నిలిచారు.. ఆయన బీజేపీలోకి వస్తే స్వాగతిస్తం” అని తెలిపారు. 

ముథోల్​ నుంచి ఐదో విడత పాదయాత్ర

ఐదో విడత పాదయాత్రను ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తామని, బాసర అమ్మవారిని దర్శించుకొని ముథోల్ నియోజకవర్గం నుంచి కొనసాగిస్తామని సంజయ్​ వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణతో తనకు అనుబంధం ఉందని, గతంలో ఫోన్ చేసి తన పార్లమెంట్ అనుభవాలను  పంచుకున్నారని తెలిపారు. ‘‘సినిమాలు చూడక 20 ఏండ్లు దాటింది. కానీ ఇప్పుడు కేసీఆర్ కే సినిమాలు చూపిస్తున్నం. అసెంబ్లీ ఎన్నికల నాటికి కేసీఆర్​కు వ్యతిరేకంగా చాలా ఫైల్స్ వస్తయ్​. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సీఎంకు వ్యతిరేకంగా ఫైల్స్ తీసేందుకు ముందుకు వస్తున్నరు” అని అన్నారు.

పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తం

‘‘బీజేపీ సింహం.. సింగిల్ గానే పోటీ చేస్తుంది.. జనసేనతో పాటు మరే పార్టీతో పొత్తు పెట్టుకోబోం.. ఒంటరిగానే పోటీ చేస్తం.. రాష్ట్రంలో హంగ్ రాదు... పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తం... అమ్ముడుపోయే నాయకులున్న కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలంతా బీజేపీలోకి రావాలని కోరుతున్న” అని సంజయ్​ అన్నారు. మునుగోడు ఓటమితో బీజేపీ కుంగిపోలేదని, మరింత ఉత్సాహంతో, పట్టుదలతో ముందుకు సాగుతామని చెప్పారు. ‘‘మునుగోడులో నైతిక విజయం బీజేపీదే.  నల్గొండలో  బీజేపీ లేదని విమర్శించిన వారికి మునుగోడు ఎన్నికతో సమాధానం చెప్పినం. మునుగోడును దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ ఏమైండు?  ఎక్కడున్నడు?  అక్కడ టీఆర్ఎస్ గెలిచినా కనీసం సంబురాలు జరుపుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. అదీ ఓ గెలుపేనా?” అని అన్నారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు సాధించడమే బీజేపీ లక్ష్యమని, అందుకోసం ప్రణాళికబద్ధంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని వివరించారు.