ఈ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే కేసీఆరే : బండి సంజయ్

ఈ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే కేసీఆరే : బండి సంజయ్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ హైదరాబాద్లో నడిచిన హైడ్రామాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదొక పొలిటికల్ డ్రామా అని.. దీనికి ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ కథ, స్క్రీన్ ప్లే రచించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో దొరికిన స్వామీజీలను  కేసీఆర్ ఢిల్లీలో కలిసి మాట్లాడి ఉండొచ్చని బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. ఈ డ్రామాలాడి టీఆర్ఎసే దొంగలా దొరికిపోయిందన్నారు. ‘‘ ఫామ్ హౌస్ మీదే..ఆరోపణలు మీ మీదే.. బాధితులు మీరే..  ఇదేం విచిత్రమైన డ్రామా .. టీఆర్ఎస్  డ్రామా ప్రజలకు తెలిసిపోయింది. దీంతో మునుగోడులో బీజేపీ విజయం ఖాయమైపోయింది’’ అని బండి సంజయ్ కామెంట్ చేశారు.  బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.  

‘‘ మునుగోడుకు సంబంధించిన ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గత మూడు రోజులుగా ఫిల్మ్ నగర్ లోని దక్కన్ కిచెన్ హోటళ్లనే అడ్డ పెట్టిండు. ఇప్పుడు దొరికిన ఎమ్మెల్యేల్లో ఒకరు.. గత మూడు రోజులుగా ప్రగతి భవన్ కు ఉదయం 10 గంటలకు వెళ్లి రాత్రి 11 గంటలకు వస్తాండు. కాదు అంటే సీసీ ఫుటేజీ చూడాలి.  దక్కన్ కిచెన్ హోటల్ మూడు రోజుల సీసీ ఫుటేజీ, ప్రగతి భవన్ గత మూడు రోజుల సీసీటీవీ ఫుటేజీ చూస్తే మొత్తం బండారం బయటపడుతుంది’’ అని సంజయ్ చెప్పారు. ‘‘లేదంటే ఈవిషయంపై యాదాద్రిలో ప్రమాణం చేద్దాం రా’’ అని  సీఎం కేసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. ‘‘ నెత్తి మీద రూపాయి పెడితే అర్ధరూపాయికి కూడా అమ్ముడుపోని ఆ నలుగురు ఎమ్మెల్యేలను  ఎవరు కొంటరు ?’’ అని కామెంట్ చేశారు. 

ఎమ్మెల్యేల ఫోన్లను సీజ్ చేసి దర్యాప్తు చేయాలి : చింతల రామచంద్రారెడ్డి

టీఆర్ఎస్ నేతల డ్రామాలను ప్రజలు నమ్మరని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి అన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌజ్ లో దొరికిన డబ్బులెన్నో పోలీసులు బయటపెట్టాలన్నారు. ఆ ఎమ్మెల్యేల ఫోన్లను సీజ్ చేసి.. కాల్ రికార్డులను సేకరించి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. డబ్బులతో ప్రజాప్రతినిధులను కొనే సంప్రదాయం బీజేపీకి లేదని స్పష్టంచేశారు. నలుగురు ఎమ్మెల్యేలను నేరుగా ప్రగతి భవన్ కు ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని టీఆర్ఎస్ సర్కారును ప్రశ్నించారు. బీజేపీపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారణమైనవని తేల్చి చెప్పారు.