కాంగ్రెస్​, టీఆర్ఎస్​ లోపాయికారీ ఒప్పందం : బండి సంజయ్​

కాంగ్రెస్​, టీఆర్ఎస్​ లోపాయికారీ ఒప్పందం : బండి సంజయ్​

ఢిల్లీ  : సీనియర్​ నాయకులు మర్రి శశిధర్​ రెడ్డి కాంగ్రెస్​ నుంచి బీజేపీలో చేరడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పోరాటాలను నమ్మి పార్టీలో చేరుతున్న మర్రి శశిధర్​ రెడ్డికి ఆయన హృదయ పూర్వక స్వాగతం పలికారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం పార్టీలోని నాయకులమంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. మర్రి శశిధర్​ రెడ్డి బీజేపీలో చేరిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో​ బండి సంజయ్​ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్​ సర్కారు భ్రష్టు పట్టిస్తోందన్నారు.

“తెలంగాణ అభివృద్ధి గురించి కేసీఆర్​ ఆలోచించడం లేదు. కనీసం జీతాలు కూడా ఇయ్యలేని స్థితిలో  రాష్ట్రం ఉంది. సంక్షేమ పథకాలను సైతం అమలు చేయలేకపోతున్నరు. కాంగ్రెస్​, టీఆర్ఎస్​ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని.. పైకి కొట్లాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నాయని పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్​, టీఆర్ఎస్​ లతో బీజేపీ అలుపెరగకుండా పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. “కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోడీని తిట్టడంపైనే కేసీఆర్​ దృష్టి పెట్టారు. తెలంగాణ అభివృద్ధి గురించి కేసీఆర్​ ఆలోచించడం లేదు ”అని బండి సంజయ్​ వ్యాఖ్యానించారు.