హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు, కమీషన్లపై మాత్రమే ఆధారపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. అవినీతి, బెదిరింపులు, మత రాజకీయాల సమస్యలను పెంచుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అయితే.. కాంగ్రెస్లో కాంట్రాక్ట్ పాలన నడుస్తున్నదని ఆరోపించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
పోలీసులపై దుండగులు దాడులు చేస్తున్నారని, అయినా ప్రభుత్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ప్రజలు అవకాశమిచ్చారని, ఈసారి జూబ్లీహిల్స్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కాగా, వనపర్తి జిల్లాకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు.
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. మోదీ విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం12 ఏండ్లుగా అవినీతి రహిత పాలనను అందిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం రహమత్ నగర్లో పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
