బీఆర్ఎస్​కు కాంగ్రెస్ ​బీ టీమ్ : తరుణ్ చుగ్​

బీఆర్ఎస్​కు కాంగ్రెస్ ​బీ టీమ్ : తరుణ్ చుగ్​
  • బీఆర్ఎస్​కు కాంగ్రెస్ ​బీ టీమ్
  • బీజేపీ స్టేట్ ​ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్​ 

నల్గొండ అర్బన్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీ టీమ్​గా పనిచేస్తున్నదని బీజేపీ స్టేట్​ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్​ఆరోపించారు. గురువారం నల్గొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల కోర్​ కమిటీ సమావేశాలకు ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. సెగ్మెంట్ల వారీగా సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. పార్టీ బలోపేతంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టి, కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలను ప్రతిపక్షంలో కూర్చోబెడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

కేసీఆర్, కవిత అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : రాజగోపాల్​రెడ్డి 

కేసీఆర్, ఆయన కూతురు కవిత​చేసిన అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆట ఇప్పుడే మొదలైందని బీజేపీ లీడర్​ కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. అవినీతికి పాల్పడిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా జైలు పాలయ్యాడని, అవసరమైతే కేసీఆర్​కూడా జైలుకు వెళ్లకతప్పదన్నారు. తప్పుచేసినవారు జైలుకు వెళ్లాల్సిందేనని, అందులో కేసీఆర్ కు మినహాయింపు ఉండదన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్​ షా సారథ్యంలో తెలంగాణలో నీతివంతమైన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. నల్గొండలో బీజేపీని బలోపేతం చేస్తామని, రానున్న  ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ మైండ్ గేమ్ ట్రాప్ లో పడొద్దన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్​రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్​గౌడ్​, కిసాన్​ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.