విద్యార్థుల కడుపు నింపలేని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత?

విద్యార్థుల కడుపు నింపలేని ప్రభుత్వం ఉంటే ఎంత?  ఊడితే ఎంత?

‘పురుగుల అన్నం, కారం నీళ్ల చారు’ ఈ తిండితోనేనా భావి తెలంగాణ పౌరులను తీర్చిదిద్దాలానుకుంటున్నది? ప్రభుత్వ హాస్టళ్లల్లో కేసీఆర్ ప్రభుత్వం పెడుతున్న పురుగులన్నం, కప్పల బిర్యానీ తింటే పేదపిల్లలు ఎట్లా పైకొస్తరు? తిండి తింటే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అని మహాకవి గురజాడ అన్నట్టుగా మంచి తిండి తింటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటడు. ఆరోగ్యంగా ఉంటేనే శ్రద్ధగా చదవగలడు, పని చేయగలడు. మరి 70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి బాగా చదువుకోవాలంటే పిల్లలకు మంచి తిండి పెట్టాలని తెల్వకపోవడం విడ్డూరం. తెలంగాణ వస్తే కేజీ నుంచి పీజీ వరకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య దొరుకుతదని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వం నడుపుతున్న అన్ని హాస్టళ్లలో కనీస సౌలత్ లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నరు.  బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కొంత కాలంగా ఫుడ్ పాయిజనింగ్ తో చదువులు మానేసి ఆస్పత్రుల్లో చేరుతున్నరు. ఇటీవల అక్కడి మెస్​లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని1200 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పదే పదే భోజనంలో పురుగులు, కీటకాలు ప్రత్యక్షమవుతుండటాన్ని ప్రశ్నిస్తూ వారు నిరసన తెలియజేయడం కూడా తప్పే అయింది. విద్యార్థుల మీద కోపంతో బాసర క్యాంపస్ ని పోలీసుల నిర్బంధంలో ఉంచిన రోజే కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ వికృత రూపం ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. ఇదే ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్న సంగతిని నాటకీయంగా మార్చిన తీరు రాష్ట్ర ప్రజానీకాన్ని కలవర పెట్టింది. విద్యార్థుల కష్టాలను చూసి చలించిపోయిన గవర్నర్ తమిళిసై బాసర ట్రిపుల్ ఐటీకీ వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల..

గత రెండు మూడు నెలల నుంచి ఎక్కడ చూసినా గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థుల దయనీయ పరిస్థితులు కళ్లకు కట్టే వార్తలే కనిపిస్తున్నయ్. ఒకటి రెండు చోట్ల జరిగితే పొరపాటు అనుకోవచ్చు. కానీ, వరుసగా ఇలాంటి ఘటనలే దర్శనమిస్తున్నాయంటే, మన విద్యార్థుల పట్ల, వారి సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరు ఇప్పలపల్లి జ్యోతిబాపులే బీసీ హాస్టల్ లో 34 మంది విద్యార్థులు ఫుడ్​బాగలేక అనారోగ్యానికి గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని కేజీబీవీలో టెన్త్​చదువుతున్న బాలిక అనారోగ్యంతో కన్ను మూసింది. సిద్దిపేట మైనారిటీ రెసిడెన్షియల్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే జిల్లాలలో ఎన్నాంపల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో కలుషిత ఆహారం తిన్న 45 మంది విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉన్న విద్యారణ్యపురి సోషల్​వెల్ఫేర్​ విద్యాలయంలో విద్యార్థులకు వడ్డించిన కిచిడీలో ఏకంగా కప్ప కనిపించింది. అప్పటికే ఆ కిచిడీ తిన్న పిల్లలు వాంతులు చేసుకున్నారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ, వసతి గృహాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కారేపల్లి మండలం గాంధీనగర్ గురుకులంలో నిద్రపోతున్న ఐదుగురు స్టూడెంట్లను ఎలుకలు కరిచాయంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉందో అర్థమవుతోంది. హాస్టళ్లపై వస్తున్న కథనాలకు స్పందించి రంగారెడ్డి జిల్లా సివిల్ జడ్జి శ్రీదేవి స్వయంగా పరిగి గురుకులాన్ని సందర్శించారు. అన్నంలో కప్ప వచ్చిందని ఓ 
విద్యార్థి చెప్పగా జడ్జి అవాక్కయ్యారు.

సాలు దొర.. సెలవు దొర!

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా అనేక ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించిన. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎప్పుడు కూలిపోతయో కూడా తెల్వని పాతబడితన భవనాల్లో హాస్టళ్లు నడుపుతున్నారు. ఇగ, అద్దెకు తీసుకొని నడుపుతున్న హాస్టల్ భవనాల్లో అత్యధిక శాతం టీఆర్ఎస్ నాయకుల అనుచరులు కట్టిన భవనాలు, అపార్ట్ మెంటులే! వీటిలో చాలావరకు పిల్లలు ఆడుకునేందుకు మైదానాలు లేవు. కనీస సౌకర్యాలు లేవు. అయినా సరే ప్రభుత్వం లక్షల కొద్ది అద్దె చెల్లిస్తూ గులాబీ అనుచరుల జేబులు నింపుతున్నది కానీ, సొంత భవనాల నిర్మాణంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. కరెంటు లేని చీకటి గదుల్లో క్లాసులు నిర్వహిస్తున్న హాస్టళ్లను చూసిన. చాలా తరగతి గదులకు కిటికీలు, తలుపులు లేవు. వేడినీళ్లు లేకపోవడం వల్ల చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నమని, బెడ్ షీట్లు ఉతకడానికి కనీసం దోబీ కూడా లేకపోవడం వల్ల దుప్పట్లు వాసన వస్తున్నయని గోడు వెళ్లబోసుకున్న పిల్లల అమాయ ముఖాలు ఇంకా నా కళ్లముందే మెదలాడుతున్నయ్. కేసీఆర్ జిల్లా పర్యటనలకు వెళ్తే ఆ జిల్లా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నరు. సీఎం పర్యటనకు, విద్యాసంస్థలకు సంబంధం ఏంటి? పాఠశాలల్లో ఇంకా పుస్తకాలు రాలేదు, యూనిఫారాలు రాలేదని నిలదీస్తరని తప్పించుకోవడానికి ఇది టీఆర్ఎస్ ఆడుతున్న నాటకం కాదా? సన్న బియ్యం ఇస్తున్నమని చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముక్కిన దొడ్డు బియ్యమే వండుతున్నరని విద్యార్థులు ఆందోళన చేస్తున్నా పట్టించుకుంటలేదు. తెలంగాణ వస్తే బడులు, విశ్వవిద్యాలయాలు బాగుపడుతయని సకలజనులు కలలు కన్నరు. కానీ, ఎనిమిదేండ్ల నుంచి చూస్తున్నం.. కేసీఆర్ విద్యా వ్యవస్థను, సంక్షేమ హాస్టళ్లను ఆగం చేస్తున్నరు. ఇగ సాలు దొర... సెలవు దొర. మొదటి విడత ప్రజాసంగ్రామ యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం బీజేపీ అధికారంలోకి రాగానే 
ఉచిత విద్య, వైద్యం అందించి తీరుతాం.

మెస్​ చార్జీలు సరిపోతయా?

హనుమకొండ, ముథోల్, నల్లగొండ, మహబుబాబాద్, నారాయణఖేడ్... ఇట్లా చెప్పుకుంటూపోతే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల గురించి చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం? కలుషిత వాతావరణం, నాసిరకం భోజనం! ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నయ్. ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పింఛన్లు, కల్యాణ లక్ష్మీ చెక్కులు పంచుతూ వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు. పిల్లలకు ఓటు హక్కు లేదనేమో, టీఆర్ఎస్ నేతలు అటువైపు కన్నెత్తి చూడటం లేదు! ఎద్దు ఏడిస్తే ఎవుసం బాగుపడదన్నట్టే, విద్యార్థులు ఏడిస్తే రాష్ట్రం బాగుపడదని కేసీఆర్ గుంపు తెలుసుకోవాలే. ప్రభుత్వం రోజువారీగా విద్యార్థుల కోసం రూ.30 కేటాయిస్తోంది. ఇందులో గ్యాస్ ఖరీదు సహా మ్యాన్ పవర్ కోసం రూ.8 ఖర్చు చేస్తారు. మిగిలిన రూ. 22తో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతోపాటు రెండుసార్లు టీ, సాయంత్రం స్నాక్స్, వారానికి రెండు సార్లు నాన్​వెజ్, ఐదు రోజులు గుడ్డుతో కూడిన మెనూ పెట్టాలి. ఆచరణలో ఇది సాధ్యమా? ప్రభుత్వం మార్కెట్​ రేటును బట్టి మెనూ బిల్లును పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు.

- బండి సంజయ్ కుమార్,
కరీంనగర్​ఎంపీ, బీజేపీ స్టేట్​చీఫ్​