రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా..కేంద్రం సహకరిస్తది:కిషన్ రెడ్డి

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా..కేంద్రం సహకరిస్తది:కిషన్ రెడ్డి
  • వివక్ష చూపకుండా తెలంగాణ అభివృద్ధికి ఫండ్స్​ ఇస్తది: కిషన్ రెడ్డి
  • బీజేపీపై బురదజల్లిన కేసీఆరే చివరకు ఫామ్ హౌజ్ కు వెళ్లిండు
  • సొంత పార్టీ వాళ్లే ఓడించారన్న సంజయ్ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. కేంద్రం ఎలాంటి వివక్ష చూపకుండా అభివృద్ధి పనులకు తన వంతు సహకారాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డామని.. అయినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని ఆయన అన్నారు. జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమీ క్ష జరిపి, పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షించుకొని ముందుకెళ్తామన్నారు. లోక్​సభ ఎన్నికల్లో ఇలాంటి తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు డబ్బులు పంచి గెలిచారు. కాంగ్రెస్ కు తెలంగాణలో ఉన్న పరిస్థితి చత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో లేదు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ తీసుకుంది. మధ్యప్రదేశ్ లో ఓటర్లు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ మాకు ఇచ్చారు. కామారెడ్డిలో ప్రస్తుత సీఎంతో పాటు.. కాబోయే సీఎం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని మా బీజేపీ అభ్యర్థి ఓడించి రికార్డు సృష్టించారు” అని కిషన్​ రెడ్డి అన్నారు. అక్కడ  విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డికి కిషన్ రెడ్డి అభినందనలు చెప్పారు. 

బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంక్

ఈ ఎన్నికల్లో బీజేపీ 7 నుంచి14 శాతానికి ఓటు బ్యాంక్​ను పెంచుకుందని కిషన్​ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గేదే లేదు. ఐదేండ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా ఇప్పటి నుం చే దృష్టి పెడతాం. మేము గెలిచింది 8 స్థానాలే కావచ్చు.. కానీ మాకు 80 మంది బలాన్ని ఓటర్లు ఇచ్చారు. భవిష్యత్తులో మరింత కసితో పనిచేస్తాం. ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర పోషిస్తాం.. ప్రజల పక్షాన నిలబడుతాం. మా పోరాటం కాంగ్రెస్​కు లాభం చేకూర్చింది.. అయినా పోరాటం చేస్తూనే ఉంటాం”అని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. తమపై బురద జల్లిన కేసీఆర్.. చివరకు ఫామ్ హౌస్​​కు వెళ్లాడని విమర్శించారు. ‘‘ఈ ఎన్నికల్లో మేము ప్రచా రానికి వెళ్లిన సమయంలో బీఆర్​ఎస్, కాంగ్రెస్ ఓటర్లు కూడా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తామో తెలియదు కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో మా పార్టీకి మంచి ఫలితాలు ఉంటాయని దీన్నిబట్టి తెలుస్తుంది”అని కిషన్​రెడ్డి అన్నారు. పార్ల మెంట్ ఎన్నికలకు సిద్ధమవడం, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళిపై తమ పార్టీ జాతీయ నేతలకు వివరిస్తానని చెప్పారు. కర్నాటక ఎన్నికల ఫలితాలకు తోడు, తమపై తప్పుడు ప్రచారంతో బురద జల్లడం, ఇతర కారణాల వల్ల బీజేపీ ఓడిపోయిందని ఆయన చెప్పారు. వీటిపై విశ్లేషణ చేసుకుంటామన్నారు. “మా పార్టీ వాళ్లే .. నన్ను ఓడించారు”అని బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఆ విషయం తన దృష్టికి రాలేదన్నారు.

రాజాసింగ్ కుకిషన్ రెడ్డి కంగ్రాట్స్​

గోషామహల్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన రాజాసింగ్ ను  కిషన్ రెడ్డి అభినందించారు. సోమవారం రాజాసింగ్ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి.. ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు.