
యాదాద్రి, వెలుగు: జీఎస్టీ తగ్గించినందుకు తమ ఆదాయం పోయిందంటూ పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీయే యేతర పార్టీలు గగ్గోలు పెడుతున్నాయని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. సోమవారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని గంజ్ మార్కెట్‌లో స్థానిక వ్యాపారులు ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. జీఎస్టీ కౌన్సిల్‌లో ఉన్న కాంగ్రెస్‌సహా ఇతర పార్టీలకు చెందిన ఆర్థిక మంత్రులు గతంలో పన్నుల తగ్గింపు గురించి మాట్లాడారని గుర్తుచేశారు.
ఇప్పుడు తగ్గించాక రాష్ట్రాలకు వచ్చే ఇన్‌కం పోయిందంటున్నారని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఊరట కలుగుతోందన్నారు. రాష్ట్రాల ఇన్‌కం కూడా తగ్గబోదని, కొనుగోళ్లు పెరిగి మరింత ఆదాయం పెరుగుతుందని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. చిన్న వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. అనంతరం పలు షాపులను ఆయన సందర్శించి, జీఎస్టీ తగ్గింపు గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావును స్థానిక వ్యాపారులు సన్మానించారు.