దేవాదాయశాఖ భూములపై నారాయణఖేడ్ ఎమ్మెల్యే కన్నుపడింది : సంగప్ప

దేవాదాయశాఖ భూములపై నారాయణఖేడ్ ఎమ్మెల్యే కన్నుపడింది : సంగప్ప

హైదరాబాద్ : దేవాదాయశాఖ భూములను బీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఆరోపించారు. రాష్ట్రంలోని దేవాదాయశాఖ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఎంతో విలువైన కాశీనాథ్ మందిర్ భూములపై స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కన్ను పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగానే దేవాదాయశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు.

నిరుపేద హిందువులకు కేటాయించాల్సిన భూములను అన్య మతస్తులకు కేటాయించడం సరైన పద్ధతి కాదన్నారు. భూముల వేలం పాటను రద్దు చేయకపోతే.. వెయ్యిమంది హిందువులతో దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ముందు వీహెచ్ పీ, బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ పేషీలో మెమొరాండం ఇచ్చారు.

నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లోని కాశీనాథ్ మందిర్ కు సంబంధించిన భూమిలో అన్యమతస్తులకు కొన్ని కమర్షియల్ ప్లాట్ లు  కేటాయించారని వీహెచ్ పీ ధర్మప్రసార కో కన్వీనర్ సుభాష్ చందర్ ఆరోపించారు. బహిరంగ వేలం పాటలో దేవాదాయశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. హిందూయేతరులకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకొని.. వేలం పాటను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.