జన్నారం, వెలుగు: బీజేపీలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని ఆ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రఘునాథ్ వెరబెల్లి అన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఆదివారం మొదటిసారి జన్నారం మండలానికి వచ్చిన ఆయనకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంగడి బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రఘునాథ్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జన్నారం మండలంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి, సత్తా చాటాలన్నారు.
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ.. ఎన్నో హామీలిచ్చి అమలు చేయని కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. కష్టపడితే ఖానాపూర్ లో బీజేపీ జెండా ఎగురుతుందని తెలిపారు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, జిల్లా నాయకులు గాజుల ముఖేశ్ గౌడ్, శంకరయ్య, మండల ప్రెసిడెంట్ మధుసూదన్ రావు, జనరల్ సెక్రటరీ ఎరుకల రమేశ్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బద్రినాయక్, నాయకులు పాల్గొన్నారు.
