కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలె

కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలె
  • హుజూరాబాద్‌‌లో జరుగుతున్నది ధర్మయుద్ధం
  • బీజేపీని గెలిపించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలె
  • ఓటర్లకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపు
  • గడీల పాలనకు ఘడియలు దగ్గరపడ్డయ్
  • రాక్షస పాలన పోయి రాముని పాలన రావాలని జనం కోరుకుంటున్నరు

జమ్మికుంట/వీణవంక, వెలుగు: ‘‘కేసీఆర్ కుటుంబ పాలనకు, ఆయన అహంకారానికి.. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ధర్మయుద్ధమిది. ఈ యుద్ధంలో హుజూరాబాద్ ప్రజలు విజయం సాధిస్తారు” అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, దుర్మార్గాలను పాతరేసేందుకు నిరుద్యోగ యువత, విద్యావంతులు, మహిళలు, రైతులు ఈ నెల 30న బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌‌‌‌ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల, మాచనపల్లి, వీణవంక మండలం ఎలబాక, గంగారం, బొంతుపల్లి, గన్ముకుల గ్రామాల్లో వివేక్ ప్రచారం చేశారు. ఎస్సీ కాలనీల్లో పర్యటించారు. టీఆర్ఎస్ పాలనలో దళితజాతికి జరుగుతున్న అన్యాయాలను వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను దగా చేస్తోందని, ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితున్ని చేస్తానని, లేనిపక్షంలో తల నరుక్కుంటానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఏడున్నరేళ్లుగా దళితుల ముందు రోజూ తల నరుక్కుంటూనే ఉన్నారని ఎద్దేవా చేశారు.

వారం రోజులు చాలా ముఖ్యం
వావిలాల, బొంతుపల్లి, గన్ముకుల గ్రామాల్లో బీజేపీ క్రియాశీల కార్యకర్తలతో వివేక్ సమావేశాలు నిర్వహించారు. ‘‘రానున్న వారం రోజులు అత్యంత కీలకం. టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురిచేస్తరు. వాళ్లిచ్చే పైసలు తీసుకోండి. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌‌‌‌కు ఓటు వేసి దళితులు, బడుగు, బలహీన వర్గాలు, సబ్బండ వర్గాల సత్తాను మరోసారి చాటిచెప్పండి” అని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో గడీల పాలనకు గడియలు దగ్గర పడ్డాయని, కుటుంబ పాలన అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాక్షస పాలన పోయి రాముని పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

చెరో దిక్కు పారిపోయిన్రు
హుజూరాబాద్‌‌‌‌లో టీఆర్ఎస్ అభ్యర్థి చిత్తుగా ఓడిపోతున్నాడని ప్రభుత్వ నిఘా సంస్థల సర్వేలు ఘోషిస్తున్నాయని.. దీంతో దిమ్మ తిరిగి కేసీఆర్ హుజూరాబాద్‌‌లో అడుగుపెట్టేందుకు వణికిపోతున్నారని వివేక్ ఎద్దేవా చేశారు. ‘‘హుజూరాబాద్‌‌లో అడుగు పెట్టేందుకు కేసీఆర్ కుటుంబం వెనుకడుగు వేస్తున్నది. ఎమ్మెల్సీ కవిత.. విదేశీ పర్యటనకు వెళ్లారు. కొడుకు కేటీఆర్.. ఐటీ కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకుని హైదరాబాద్‌‌కే పరిమితమైండు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో దుర్మార్గమైన పన్నాగాలు పన్నుతూ అల్లుడు హరీశ్‌‌తో అమలు చేయిస్తుండు. ధైర్యవంతులైన హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కుట్రలను, కుతంత్రాలను తిప్పికొడుతున్నరు” అని వివేక్ చెప్పారు.