
సీజ్‌ఫైర్ వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని పట్టు
పీవోకేను ఎప్పుడు స్వాధీనం చేస్కుంటారని ప్రశ్న
ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం అంతే: రాజ్‌నాథ్‌సింగ్
మనవి కాదు.. పాకిస్తాన్ జెట్స్ ఎన్ని కూల్చేశారని అడగండి.. దేశ రక్షణ గురించి ప్రశ్నలు
అడిగేటప్పుడు కాస్త ఆలోచించండి
పాక్ దాడుల్లో మనకు ఎలాంటి నష్టం జరగలే
సీజ్‌ఫైర్ కోసం పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందని వెల్లడి
కాల్పుల విరమణపై మోదీ సమాధానం
చెప్పాలి: కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ డిమాండ్
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రతిపక్షాలకు ఉన్న అనుమానాలు తీర్చేందుకు సోమవారం చర్చకు అవకాశం కల్పించారు. అధికార పక్షం తరఫున కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చర్చను ప్రారంభించారు. పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు.
మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారని గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్తాన్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారని అన్నారు. పహల్గాం ఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టకపోవడం, పాక్‌కు బుద్ధి చెప్పామంటూనే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేయడం లాంటి అంశాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. పాక్‌పై భారత్ కాల్పుల విమరణకు ఎందుకు అంగీకరించిందో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాకుండా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు.
100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినం
పహల్గాం ఉగ్రదాడి కేంద్ర వైఫల్యం అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాజ్‌నాథ్‌సింగ్ స్పందించారు. పహల్గాం దాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు. దీనికి ప్రతీకారంగానే ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించామని చెప్పారు. ‘‘1971 యుద్ధం తర్వాత పాక్‌పై భారతదేశం చేపట్టిన తొలి త్రివిధ దళాల సైనిక చర్య ఇది. ఉగ్రదాడిలో సిందూరం కోల్పోయిన ఆడబిడ్డల గౌరవార్థం దీనికి ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ అని పేరుపెట్టారు. ఇది ఒక శౌర్య పరాక్రమ కథ. భారతదేశ నుదిటిపై ధైర్యానికి చిహ్నం. మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చాటిచెప్పాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్‌లోని టెర్రర్ క్యాంపులపై దాడులు జరిపాయి. ఏడు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. కేవలం 22 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తయింది. సైన్యానికి అభినందనలు. దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత” అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెప్పారు. ఈ దాడుల్లో సామాన్య పౌరులకు ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. భారత్‌లో ముఖ్యమైన ఆస్తులకు ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు. బార్డర్ దాటివెళ్లడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదని.. టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించే సంస్థలను నాశనం చేయడమే లక్ష్యమని తెలిపారు. యుద్ధం తమ లక్ష్యం కాదని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే తమ విధానమని చెప్పారు. స్నేహహస్తం అందించడమే భారత్ గొప్పతనం అని తెలిపారు. భారత్ రక్తంలోనే శాంతి ఉందని, యుద్ధాలను కోరుకోమన్నారు. గతంలో చైనా, పాక్ యుద్ధాల టైంలో ప్రతిపక్షాలు ఎలాంటి ప్రశ్నలు అడిగాయో ఒకసారి తెలుసుకోవాలని హితవు పలికారు.
ప్రతిపక్షం తప్పించుకుంటున్నది: కిరెన్రిజిజు
‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ జరగకుండా ప్రతిపక్షం దాటవేస్తున్నదని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరెన్ రిజిజు అన్నారు. చర్చ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు.. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ ముగిసిన తర్వాత బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాపై చర్చకు అనుమతిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని ప్రతిపక్షం కోరిందని చెప్పారు.
ట్రంప్ ప్రమేయం లేదు: జైశంకర్
తన మధ్యవర్తిత్వం వల్లే ఇండియా- పాకిస్తాన్ మధ్య ఘర్షణలు ఆగాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న కామెంట్లను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఖండించారు. సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. "ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదు. ఆపరేషన్ సిందూర్ టైంలో ఇండియా - పాక్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంతో ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇరు దేశాల సైనికుల మధ్య చర్చలతోనే ఒప్పందం జరిగింది. ఇతర దేశాలేవీ మధ్యవర్తిత్వం చేయలేదు" అని జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దు టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన చర్యలకు మద్దతుగా తాను 27 మంది విదేశాంగ మంత్రులతో మాట్లాడానని చెప్పారు. భారత్‌కు 40 దేశాల నుంచి మద్దతు లేఖలు అందాయన్నా రు. ప్రధాని మోదీ కూడా 20 మంది ఇతర దేశాల అధిపతులతో సంప్రదింపులు జరిపారని వివరించారు.
మీరు మరో 20 ఏండ్లు ప్రతిపక్షమే: అమిత్ షా
భారత్-పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏమీ లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇచ్చిన వివరణపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. తమ వైఖరి వల్లే ఇండియా కూటమి ప్రతిపక్షంలో ఉందని..మరో 20 ఏండ్లు ప్రతిపక్షంలోనే కూర్చుంటారని ఫైర్ అయ్యారు. సోమవారం పార్లమెంటులో అమిత్ షా మాట్లాడుతూ.." ప్రతిపక్షానికి సొంత దేశానికి చెందిన విదేశాంగ మంత్రిపై నమ్మకం లేదు. కానీ, వారికి ఇతర దేశంపై బాగా నమ్మకం ఉంది. వారి పార్టీలోని విదేశీ ప్రాముఖ్యతను నేను అర్థం చేసుకోగలను. అందుకే వారు అక్కడ (ప్రతిపక్ష బెంచీలపై) కూర్చున్నారు. మరో 20 ఏండ్లు అక్కడే కూర్చుంటారు" అని షా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. దాంతో మళ్లీ షా స్పందిస్తూ..ప్రతిపక్షం మాట్లాడినప్పుడు మేం ఓపికగా విన్నాం.. వారు చెప్పిన అబద్ధాల గురించి మంగళవారం సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.