అధికారంలోకి వస్తే బీసీ సీఎం .. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో చర్చ

అధికారంలోకి వస్తే బీసీ సీఎం .. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో చర్చ
  • రాజాసింగ్‌‌పై సస్పెన్షన్ ఎత్తివేతకు నిర్ణయం
  • ఇయ్యాల బీజేపీ ఫస్ట్ లిస్ట్.. 60 - 70 మందితో ప్రకటించే చాన్స్
  • మహిళలు, బీసీలకు ఎక్కువ సీట్లు?
  • ప్రధాని ఆధ్వర్యంలో పార్టీ ఎలక్షన్ కమిటీ భేటీ
  • నడ్డా, అమిత్​ షా, కిషన్​రెడ్డి, కె.లక్ష్మణ్​, సంజయ్​, డీకే అరుణ, ఈటల హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం రిలీజ్ చేయనుంది. ఈ లిస్టులో 60 నుంచి 70 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళలు, బీసీలకు పెద్ద పీఠ వేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను దృష్టిలో పెట్టుకొని, బీసీ అజెండాతో ముందుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం చేస్తామనే అజెండాతో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీ జరిగింది.

ఈ భేటీలో సీఈసీ మెంబర్లు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కె.లక్ష్మణ్, అరుణ్ సింగ్, సీపీ జోషి, రాజేంద్ర రాథోడ్, చంద్రశేఖర్, ఇక్బాల్ సింగ్ లాల్ పుర, సుధా యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి, బండి సంజయ్​, డీకే అరుణ, ఈటల రాజేందర్, రాజస్థాన్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర నేతలు హాజరయ్యారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ సుదీర్ఘంగా సాగింది. గంటన్నర పాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. తర్వాత తొమ్మిదిన్నరకు రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారు. రాత్రి 10.25 నుంచి తెలంగాణ అభ్యర్థులపై ఎంపికపై చర్చ జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు తెలంగాణ క్యాండిడేట్స్‌‌పై డిస్కర్షన్ చేశారు.

ఫైనల్ లిస్టులో మార్పులు, చేర్పులు

అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై వరుసగా రెండో రోజైన శుక్రవారం ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌‌చార్జ్ ప్రకాశ్ జవదేకర్ నివాసంలో ఉదయం నేతలు సమావేశం అయ్యారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, తరుణ్ చుగ్, సంజయ్, ఈటల, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. గురువారం నడ్డా చేసిన సూచనలకు అనుగుణంగా ఫైనల్ లిస్ట్ లో పలు మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిసింది. తర్వాత మధ్యాహ్నం.. మరోసారి నడ్డాతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఈసీ ముందు ఉంచబోయే ఫైనల్ లిస్టును నడ్డాకు అందజేసినట్లు తెలిసింది. మొత్తం 119 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో ఈ లిస్ట్ తయారు చేసినట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు.

ఫస్ట్ లిస్టులోనే రాజాసింగ్ పేరు?

సంఘ్ పరివార్ నుంచి వస్తున్న ఒత్తిడి, యూపీ సీఎం నుంచి గట్టి సిఫారసు నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫస్ట్ జాబితాలోనే ఆయన పేరును ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ప్రధాని స్పెషల్ ఫోకస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపినట్లు తెలిసింది. ప్రతి నియోజకవర్గం, అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల వివరాలను రాష్ట్ర నేతల నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఆయా స్థానాల్లో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, పార్టీ గెలుపునకు దోహదపడే అంశాలపై ఆరా తీశారని నేతలు చెబుతున్నారు. పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్న మహిళలు, బీసీలు, ఇతర వర్గాల వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. మరోవైపు బీజేపీ ప్రకటించనున్న ఫస్ట్ లిస్ట్ లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కీలక నేతలు, పార్టీ విధేయుల పేర్లు ఉంటాయని ఓ లీడర్ తెలిపారు. హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌‌ నియోజకవర్గాలకు చెందిన నేతల పేర్లే ఈ లిస్ట్ లో ఎక్కువగా ఉండొచ్చని సమాచారం.